Satellite pics | పహల్గాం ఉగ్రదాడికి భారత్ గట్టిగా బదులు తీర్చుకున్న విషయం తెలిసిందే. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) చేపట్టి పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడింది. భారత్ చేపట్టిన ఈ దాడులతో ఉక్కిరిబిక్కిరైన పాక్.. ప్రతిదాడులకు యత్నించింది. సైనిక స్థావరాలు, పౌర నివాసాలే లక్ష్యంగా చేసుకుంది. అయితే, పాక్ యత్నాలను మన త్రివిధ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. సరిహద్దులు దాటకుండానే పాకిస్థాన్ వైమానిక స్థావరాలు, రాడార్ కేంద్రాలపై బ్రహ్మోస్ క్షిపణులు, డ్రోన్లతో దాడిచేసి ధ్వంసం చేసింది.
భారత్ చేసిన ఈ దాడిలో మురీద్ ఎయిర్ బేస్ (Murid Air Base)కు తీవ్ర నష్టం వాటిల్లినట్టు తాజాగా వెల్లడైంది. ఆ వైమానిక స్థావరంపై భారత్ జరిపిన దాడుల తీవ్రతను హై-రిజల్యూషన్ శాటిలైట్ ఫోటోలు (Satellite pics) స్పష్టం చేస్తున్నాయి. పాక్ వాయుసేన భూగర్భ కేంద్రానికి కేవలం 30 మీటర్ల దూరంలో మూడు మీటర్ల వెడల్పుతో భారీ గుంత ఏర్పడినట్లు ఫోటోల్లో కనిపిస్తోంది. అంతేగాక, డ్రోన్ హ్యాంగర్ల పక్కన ఉన్న భవనం పైభాగంలోనూ నష్టం సంభవించింది.
దాడికి ముందు ఏప్రిల్ 16 న శాటిలైట్ తీసిన ఫోటోల్లో మురీద్ ఎయిర్ బేస్‌లోని ఓ భవనం సాధారణంగా కనిపిస్తుండగా.. మే 10 దాడి తర్వాత ఆ భవనం పూర్తిగా దెబ్బతిన్నది. భవనం పైభాగం నుజ్జునుజ్జు కావడం, గోడలకు పగుళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఎయిర్ బేస్ నియంత్రణ రేఖకు 150 కిలోమీటర్ల దూరంలో చక్వాల్ జిల్లాలో ఉంది. ఈ ఎయిర్ బేస్ పాక్ ఆర్మీకి చాలా కీలకం.
మరోవైపు నూర్ ఖాన్ వైమానిక స్థావరం కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఈ వైమానిక స్థావరం.. రావల్పిండి, ఇస్లామాబాద్ మధ్య వ్యూహాత్మకంగా ఉంది. ఏప్రిల్ 25న దాడికి ముందు అక్కడ సౌకర్యాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. అయితే, ఆపరేషన్ సిందూర్ తర్వాత మే 10న తీసిన ఫోటోల్లో రెండు కమాండ్ అండ్ కంట్రోల్ ట్రైలర్ ట్రక్కులు ధ్వంసమైనట్టు చూపుతున్నాయి. మే 17 నాటి శాటిలైట్ ఫోటోల్లో పాక్ క్లీన్-అప్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు కనిపించింది. ఇక, 7,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న పాక్ సైనిక వసతి పూర్తిగా ధ్వంసమైందని, దీని మరమ్మతులు అసాధ్యమని ఇంటెల్ ల్యాబ్‌లోని జియో-ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డేమియన్ సైమన్ తెలిపారు.
Also Read..
Visa Interviews | ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. విద్యార్థి వీసా ఇంటర్వ్యూలకు తాత్కాలిక బ్రేక్
Sheikh Hasina | నన్ను కాల్చి చంపి.. గణబంధన్‌లో పాతిపెట్టండి : రాజీనామాకు ముందు షేక్ హసీనా
Golden Dome | ఆ పని చేస్తే కెనడాకు గోల్డెన్ డోమ్ ఫ్రీ.. డొనాల్డ్ ట్రంప్ ఆఫర్