Golden Dome : భవిష్యత్తుల్లో తమ గగనతలంలోకి ఏ క్షిపణీ (Missile) ప్రవేశించకుండా, ఏ అణ్వాయుధమూ సమీపించకుండా ‘గోల్డెన్ డోమ్ (Golden Dome)’ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ (Difence system) ను నిర్మించేందుకు అగ్రరాజ్యం అమెరికా (USA) సిద్ధమైంది. ఈ ప్రాజెక్టులో చేరేందుకు పొరుగు దేశమైన కెనడా కూడా ఆసక్తి కనబర్చింది. దాంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మళ్లీ విలీన డిమాండ్‌ను లేవనెత్తారు.
కెనడా తమ దేశంలో 51వ రాష్ట్రంగా చేరితే గోల్డెన్ డోమ్‌ను ఉచితంగా పొందవచ్చని ఆఫర్ చేశారు. లేదంటే 61 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. అద్భుతమైన గోల్డెన్ డోమ్ వ్యవస్థలో కెనడా భాగం కావాలని తాను కోరుకుంటున్నానని, ఇదే విషయాన్ని ఆ దేశానికి చెప్పానని తెలిపారు. కానీ విడిగా ఉంటూ ఈ వ్యవస్థలో చేరాలంటే కెనడాకు 61 బిలియన్ డాలర్ల మేర ఖర్చవుతుందని చెప్పారు.
అదే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరితే ఒక్క డాలర్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ట్రంప్ అన్నారు. ఈ ఆఫర్‌ను కెనడా పరిగణనలోకి తీసుకుంటుందని అనుకుంటున్నానని తన ట్రూత్ సోషల్‌లో ట్రంప్ రాసుకొచ్చారు. అయితే అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై కెనడా నుంచి ఇంకా స్పందన రాలేదు. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ తరహాలో అమెరికా కోసం ‘గోల్డెన్ డోమ్’ క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ట్రంప్ ఇటీవల ప్రకటించారు.
ఈ వ్యవస్థ నిర్మాణానికి 175 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.15 లక్షల కోట్లు) ఖర్చవుతుందని పేర్కొన్నారు. దీంతో అమెరికా ఇక అంతరిక్షంలోనూ ఆయుధాలను మోహరించనుందని తెలిపారు. 2029 చివరి నాటికి నూతన రక్షణ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. అమెరికా గోల్డెన్ డోమ్ ప్రకటన తర్వాత కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్పందిస్తూ.. తాము కూడా ఈ వ్యవస్థలో చేరేందుకు సిద్ధమేనని అన్నారు.
అందుకోసం అగ్రరాజ్యంతో ఉన్నతస్థాయి చర్చలు జరుపుతామని చెప్పారు. ఈ క్రమంలోనే ట్రంప్ తాజాగా పోస్ట్ పెట్టారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల నాటి నుంచే ట్రంప్.. కెనడా 51వ రాష్ట్రంగా అమెరికాలో చేరాలని డిమాండ్ చేస్తున్నారు. దీన్ని కెనడా సర్కారు ఖండిస్తూ వస్తోంది. తమ దేశం అమ్మకానికి లేదంటూ గట్టిగా చెప్పింది. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత కెనడాపై ట్రంప్ సుంకాలతో విరుచుకుపడ్డారు. ప్రతిగా కెనడా కూడా టారిఫ్‌లు విధించింది.