Sanjay Raut letter | బానిసత్వం కంటే జైలు జీవితం ఉత్తమంగా ఉన్నదని శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు జైలు నుంచి ఆయన తన తల్లికి ఉత్తరం రాశాడు. ఈడీ దాడి మొదలుకొని ప్రభుత్వాన్ని పడగొట్టడం వరకు తన 4 పేజీల లేఖలో ప్రస్తావించారు. పత్రాచాల్ కుంభకోణంలో ఇరుక్కొన్న సంజయ్ రౌత్ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు.
‘వీర శివాజీ ఇతరుల ఇంట్లో ఎందుకు పుట్టాడు. శివసేనను కాపాడేందుకు పోరాడాలి. నేను బానిస జీవితాన్ని గడపలేను. అందుకే జైలు జీవితాన్ని అంగీకరించాను’ అని లేఖలో పేర్కొన్నారు. లేఖను సంజయ్‌రౌత్ తల్లి ఇటీవల మీడియాకు అందించింది. తనను అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా నన్ను నీవు దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నావు.. ఎప్పటిమాదిరిగానే నేను సామ్నా కార్యాలయానికి వెళ్తున్నట్లుగా భావించావు.. ఎప్పుడూ త్వరగా ఇంటికి రా అని నువ్వు చెప్పినట్లుగా వచ్చాను.. కానీ ఈసారి రాలేకపోతున్నాను.. అని లేఖలో తన తల్లి స్మృతులను నెమరేసుకున్నారు.
‘సరిహద్దుల్లో ఎందరో జవాన్లు మన దేశాన్ని కాపాడేందుకు విధుల్లో ఉంటారు. వారిలో కొందరు మాత్రం ఇంటికి రారు. ఇప్పుడు పెద్ద పోరాటాన్ని చేయాల్సి వస్తున్నది. మహారాష్ట్రను, శివసేనను శత్రువుల ముందు తలవంచనీయను. త్వరలోనే తిరిగి వస్తాను..’ అంటూ తల్లికి రాసిన లేఖలో చెప్పారు. నాపై మోపిన అభియోగాలు, ఆరోపణలు తప్పుడివి అని దేశం మొత్తానికి, మహారాష్ట్ర ప్రజలకు తెలుసునని, వారు చెప్పినట్లు వినకుండా థాకరేపక్షాన్ని విడిచిపెట్టక పోవడం వల్లనే ఈ అవస్థ తనకు వచ్చిందని ఆ లేఖలో పేర్కొన్నారు.