ముంబై, జనవరి 1( నమస్తే తెలంగాణ): శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌పై సొంత పార్టీ కార్యకర్తలే దాడి చేసినట్టు సమాచారం. పార్టీ చీఫ్, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసంలోనే ఆయనపై కార్యకర్తలు దాడి చేసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. బుధవారం ముంబైలోని బాంద్రాలో ఉన్న మాతోశ్రీలో ఉద్ధవ్ ఠాక్రేతో సంజయ్ రౌత్ సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా కొంత మంది పార్టీ కార్యకర్తలు సంజయ్‌తో వాగ్వాదానికి దిగారు.
ఆయన వ్యాఖ్యల వల్లే పార్టీ తీవ్రంగా నష్టపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, వాగ్వాదం చోటుచేసుకోగా, సంజయ్‌రౌత్‌పై ఠాక్రే మద్దతుదారులు దాడి చేసి కొట్టారు. అనంతరం అతడిని కొన్ని గంటల పాటు ఓ గదిలో నిర్బంధించి తాళం వేశారు.
ఇదంతా ఠాక్రే సమక్షంలోనే జరిగినట్టు తెలిసింది. అయితే దీనిపై ఠాక్రే కానీ, సంజయ్ రౌత్ గానీ స్పందించ లేదు. కాగా, మహారాష్ట్రలో జరగబోయే బీఎంసీ ఎన్నికలపై ఉద్ధవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ నేత ఆనంద్ దూబే చెప్పుకొచ్చారు.