ముంబై, నవంబర్ 9: శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు బెయిల్ మంజూరైంది. పాత్రా చావల్ పునరాభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ముంబైలోని పీఎంఎల్ఏ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం ఆయనకు బెయిల్ ఇచ్చింది. ఈ ఏడాది జూలై 31న అరస్టైన సంజయ్ రౌత్, ముంబైలోని అర్థూర్ రోడ్డు జైలులో ఉన్నారు. రౌత్‌తో పాటు సహ నిందితుడు ప్రవీన్ రౌత్‌కు కూడా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
శుక్రవారం వరకు బెయిల్ ఆర్డర్‌ను అమలు చేయవద్దని ఈడీ చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. దీంతో బెయిల్‌పై స్టే విధించాలని కోరుతూ ఈడీ బాంబే హైకోర్టులో పిటిషన్ వేయగా.. అత్యవసర స్టేకు న్యాయస్థానం నిరాకరించింది. ఈడీ పిటిషన్‌పై గురువారం విచారణ జరుపుతామని బెంచ్ పేర్కొన్నది.