Sanjay Raut prediction | రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ గత ఏడాది కొత్త వైభవాన్ని సంతరించుకున్నదని శివసేన (ఉద్దవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. ప్రస్తుత ఏడాది కూడా ఈ వైభవం ఇలాగే కొనసాగితే 2024 ఎన్నికల్లో మార్పు ఖాయంగా వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. 2023 నాటికి దేశం భయం లేకుండా ఉంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. శివసేన పత్రిక ‘సామ్నా’లో రోఖ్‌థోక్ కాలంలో సంజయ్‌రౌత్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలతో కూడిన కథనం ప్రచురితమైంది.
‘ప్రస్తుతం నడుస్తున్నవి పవర్ పాలిటిక్స్. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విజయవంతమైంది. అది లక్ష్యాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను. ఈ వైభవం ఇలాగే కొనసాగితే దేశ రాజకీయాల్లో పెను మార్పులు రావడం ఖాయం’ అని సంజయ్ రౌత్ తన కాలంలో రాశారు. దేశంలో విభజన, ద్వేషం విత్తనాలు నాటవద్దని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ, అమిత్‌షాకు సూచించారు. రామ మందిరం నిర్మాణ పనులు పూర్తికావస్తున్నందున ఇకపై రాముడి పేరు చెప్పి ఓట్లు అడగాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. అందుకే లవ్ జిహాద్ అనే కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని ఆరోపించారు. లవ్ జిహాద్ ఆయుధంతో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ కుట్రపన్నిందని పేర్కొన్నారు.
నటి తునీషా శర్మ, శ్రద్ధ వాకర్ హత్యలు లవ్ జిహాద్ కిందకు రావని సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. మహిళలు ఏ వర్గంవారైనా వారిపై దాడులు జరగడం సరికాదన్నారు. ఈ సంవత్సరంలోనైనా భారత్ భయం గుప్పిట్లో నుంచి బయటకు వస్తుందని భావిస్తున్నట్లు రౌత్ చెప్పారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల సమస్యలను పక్కన పెట్టారని పేర్కొంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.