ముంబై: తెగల మధ్య పోరుతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న మణిపూర్‌లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటించరని, ఆ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పాలనే ఉద్దేశం ఆయనకు లేదని ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అరోపించారు. అయితే ప్రధాని మోదీని మణిపూర్‌లో పర్యటించేలా చేయడానికి తమ దగ్గర ఒక పరిష్కారం ఉన్నదని ఆయన చెప్పారు.
అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడికి ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22న తాను మహారాష్ట్రలోని నాసిక్‌లోగల కళారామ్ ఆలయాన్ని సందర్శిస్తానని మా పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ఇటీవల ప్రకటించారని, దాంతో ఇవాళ నాసిక్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ తన షెడ్యూల్లో లేకపోయినా కళారామ్ ఆలయాన్ని సందర్శించారని సంజయ్ రౌత్ చెప్పారు. ఉద్ధవ్ థాకరే ప్రకటన నేపథ్యంలోనే మోదీ పొలిటికల్ మైలేజీ కోసం ఇలా చేశారని విమర్శించారు.
ప్రధాని మోదీలోని ఈ లక్షణం ఆయనను మణిపూర్‌లో పర్యటించేలా చేయడంలో మాకు ఒక పరిష్కార మార్గమని సంజయ్ రౌత్ చెప్పారు. మణిపూర్‌లో కూడా చిన్న రామాలయం ఉన్నదని, మా పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే ఆ రామాలయాన్ని సందర్శిస్తానని ప్రకటిస్తే.. ప్రధాని మోదీ మణిపూర్‌కు వెళ్లి ఆయన కంటే ముందే ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉన్నదని రౌత్ ఎద్దేవా చేశారు. ప్రధాని మణిపూర్‌లో పర్యటించి అక్కడ శాంతి నెలకొల్పేందుకు కృషి చేయాలని సూచించారు.