
Sanjay Raut | ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌లో 12 కోట్ల విలువైన కొత్త కారు వచ్చి చేరడంపై విపక్షాలు విమర్శలు చేస్తూనే వున్నాయి. తాజాగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇదే అంశంపై మోదీని ఘాటుగా విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు తాను పదే పదే ఫకీర్‌ను అని చెబుకుంటారని, 12 కోట్ల విలువైన కారును వాడితే ఆయన ఫకీరు ఎలా అవుతారని సంజయ్ రౌత్ సూటిగా ప్రశ్నించారు. శివసేన అధికారిక పత్రిక సామ్నా వేదికగా సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి భద్రత, సౌకర్యం ఎంతో ముఖ్యమేనని, అందులో ఏమాత్రం అనుమానం లేదని, అయితే నేటి నుంచి మోదీ ఫకీర్ అని చెప్పుకోవడానికి అనర్హుడని, అలా చెప్పుకోకూడదని రౌత్ వ్యాఖ్యానించారు. స్వదేశీ, మేకిన్ ఇండియా అంటూ కేంద్రం పదే పదే ఉచ్చరిస్తూ, విదేశీ కార్లను ఎలా వాడుతారని రౌత్ సూటిగా నిలదీశారు.
శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తన వ్యాసంలో మాజీ ప్రధాని నెహ్రూను ప్రశంసించారు. దేశ విభజన తర్వాత అప్పటి ప్రధాని నెహ్రూకు తీవ్రమైన బెదిరింపులుండేవని, అయినా ఆయన ఎప్పుడూ అంబాసిడర్ కారునే వాడేవారని గుర్తు చేశారు. ఇక మాజీ ప్రధాని ఇందిర భద్రతకు ముప్పు పొంచి వున్నా, సిక్కు భద్రతా సిబ్బందినే కొనసాగించారని గుర్తు చేశారు. మరో మాజీ ప్రధాని రాజీవ్ ఎల్టీటీఈ సిబ్బంది చేతిలో దుర్మరణం పాలయ్యారని, ఆ సమయంలో ప్రజలను కలిసే సాహసం చేయకుండా ఉండాల్సిందని, అయినా రాజీవ్ చేశారని రౌత్ పేర్కొన్నారు.