న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: బీజేపీ ఎన్నికల్లో గెలిచేందుకు వీలుగా హిందూత్వ సంస్థలు 2000 దశకంలో బాంబు పేలుళ్లు జరిపాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) మాజీ సభ్యుడు యశ్వంత్ షిండే ఆరోపించారు. ఈ మేరకు ఆయన నాందేడ్ సెషన్స్ కోర్టులో ఆగస్టు 29న అఫిడవిట్ సమర్పించారు. నాందేడ్ బాంబు పేలుడు కేసులో తనను సాక్షిగా చేర్చాలని కోరారు. బీజేపీతో సహా అనేక హిందూత్వ సంస్థలకు ఆరెస్సెస్ సైద్ధాంతిక మాతృసంస్థ అన్న సంగతి తెలిసిందే. 2006లో నాందేడ్‌లో బాంబును తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలింది. ఈ ఘటనలో బజరంగ్ దళ్ కార్యకర్తతో సహా ఇద్దరు మరణించారు. ఔరంగాబాద్ జిల్లాలోని ఓ మసీదులో పేల్చేందుకు బాంబును తయారు చేస్తుండగా ఆ ఘటన జరిగిందని షిండే తన అఫిడవిట్లో పేర్కొన్నారు. చనిపోయినవారిలో హిమాంశు పన్సే అనే వ్యక్తి హిందూత్వ సంస్థల్లో పనిచేసేవాడన్నారు.
1999లో ఇంద్రేశ్ కుమార్ అనే ఆరెస్సెస్ సీనియర్ నాయకుని ఆదేశాల మేరకు తాను హిమాంశును, మరో ఏడుగురిని జమ్ముకు తీసుకువెళ్లినట్టు షిండే తెలిపారు. వారికి అక్కడ భారత సైనిక జవాన్లు ఆయుధాల శిక్షణ ఇచ్చారని వెల్లడించారు. నాలుగేండ్ల తర్వాత 2003లో మహారాష్ట్రలో బాంబు శిక్షణ కార్యక్రమానికి కూడా తాను వెళ్లానని షిండే తెలిపారు. హిమాంశు మరాఠ్వాడా ప్రాంతంలో మూడు పేలుళ్లు జరిపాడని, చివరకు నాందేడ్ మసీదులో పేల్చేందుకు తయారు చేస్తున్న బాంబు పేలి మరణించాడని వివరించారు.