Maha kumbh | విసర్జితాల కారణంగా ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో పలు చోట్ల నదీ జలాలు కలుషితమయ్యాయంటూ వస్తున్న ఆరోపణలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ఖండిచారు. నదీ జలాలపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. నదీ జలాలు స్నానాలకే కాకుండా తాగేందుకూ అనుకూలంగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. ప్రయాగ్‌రాజ్‌లోని గంగానదిలో ప్రమాదకర స్థాయిలో ‘ఫేకల్ కోలిఫాం’ బ్యాక్టీరియా (faecal coliform bacteria) ఉన్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ).. జాతీయ హరిత ట్రిబ్యునల్ (National Green Tribunal – NGT) కు నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే.
ఈ నివేదికపై ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని అసెంబ్లీలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా ఇప్పటికే 56.25 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు చెప్పారు. స్నానాలు చేసిన పలువురు భక్తులు, ప్రముఖులు అక్కడి ఏర్పాట్లపై ప్రశంసించినట్లు చెప్పారు. సనాతన ధర్మం, మా గంగ, దేశం, మహాకుంభ్‌పై నిరాధారమైన ఆరోపణలు చేసినా, నకిలీ వీడియోలను ప్రదర్శించినా 56 కోట్ల మంది ప్రజల విశ్వాసంతో ఆడుకున్నట్లే అని వ్యాఖ్యానించారు.
ఇక ఇదే సందర్భంగా ‘మహాకుంభ్’పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలనూ యోగి ఆదిత్యనాథ్ తిప్పి కొట్టారు. ఇటీవలే సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. మహాకుంభ్‌కు ఖర్చు చేయాల్సిన అవసరం ఏముంది..? అని ప్రశ్నించారు. అదేవిధంగా మహాకుంభమేళాను ‘అర్థం లేని’ కార్యక్రమంగా అంటూ రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అభివర్ణించారు. ఇక పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం మహాకుంభ్‌ను ‘మృత్యు కుంభ్’ అంటూ వ్యాఖ్యానించారు. వీరు చేసిన విమర్శలకు యోగి స్పందిస్తూ.. ‘సనాతన ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం నేరమైతే.. మా ప్రభుత్వం ఆ నేరం చేస్తూనే ఉంటుంది’ అంటూ గట్టిగా బదులిచ్చారు.
ప్రయాగ్‌రాజ్‌లోని నదీ జలాల్లో స్థాయికి మించి కోలీఫామ్ బ్యాక్టీరియా..!
ప్రయాగ్‌రాజ్‌లోని పలు చోట్ల నదీ జలాలు కలుషితమయ్యాయని.. ఆ నీళ్లలో మానవ, జంతు మల సంబంధమైన కోలీఫామ్ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోయిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (Central Pollution Control Board – CPCB) నివేదిక తయారు చేసింది. ఈ నివేదికను జాతీయ హరిత ట్రిబ్యునల్ (National Green Tribunal – NGT) కు సమర్పించింది. ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలోని గంగా, యమునా నదీ జలాల్లో స్నానాలకు కావాల్సిన ప్రమాణాలు లేవని NGT కి సమర్పించిన నివేదికలో CPCB పేర్కొన్నది. మహాకుంభమేళా సందర్భంగా కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలకు తరలివస్తుండటంతో ప్రయాగ్‌రాజ్‌లో జంతు, మానవ సంబంధ వ్యర్థాలు పెరిగిపోతున్నాయని, అదే మల సంబంధ కోలిఫామ్ బ్యాక్టీరియా స్థాయికి మించి పెరగడానికి కారణమవుతోందని NGT కి CPCB తెలియజేసింది. ఒక 100 మిల్లీలీటర్ల నీటిలో 2,500 కోలిఫామ్ బ్యాక్టీరియాలు ఉన్నా ఆ నీరు స్నానానికి యోగ్యమైనదేనని, అంతకుమించి ఉంటే చర్మ సంబంధ అనారోగ్యాలు తలెత్తుతాయని పేర్కొంది.
Also Read..
Maha Kumbh: మహాకుంభ్ తేదీలను పొడిగించడం లేదు.. స్పష్టం చేసిన ప్రయాగ్‌రాజ్ జిల్లా మెజిస్ట్రేట్
Delhi Oath | రేపే ఢిల్లీ సీఎం ప్రమాణం.. గెస్ట్ లిస్ట్‌లో గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లు, రైతులు..
Ayodhya | మహాకుంభమేళా ఎఫెక్ట్.. అయోధ్య రామమందిరం నిర్మాణ పనులకు బ్రేక్