ప్రయాగ్‌రాజ్: కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహాకుంభ్(Maha Kumbh)ను ఇప్పటికే 55 కోట్ల మందికిపైగా విజట్ చేశారు. ఫిబ్రవరి 26వ తేదీ శివరాత్రితో మహాకుంభ ముగియనున్నది. అయితే అమృత స్నానాల తేదీని పొడిగిస్తున్నట్లు వస్తున్న వార్తలపై యూపీ సర్కారు స్పందించింది. భారీ సంఖ్యలో జనం వస్తున్న నేపథ్యంలో మహాకుంభ్‌ను పొడిగిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రయాగ్‌రాజ్ జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర మందర్ తెలిపారు. మతపరమైన, మంగళకరమైన ముహూర్తం ఆధారంగా మహాకుంభ్ ఈవెంట్‌ను షెడ్యూల్ చేశారని, దీంట్లో ఎటువంటి మార్పు ఉండబోదుఅని జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర వెల్లడించారు. ముందుగా నిర్ణయించినట్లు ఫిబ్రవరి 26వ తేదీన కుంభ్ స్నానాలు ముగియనున్నట్లు తెలిపారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు.. భక్తలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మేళా తేదీలను పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ జిల్లా యాజమాన్యం నుంచి కానీ ప్రతిపాదనలు రాలేదని, తప్పుడు సమాచారం పట్ల భక్తులు ఆకర్షితులు కావొద్దు అని మెజిస్ట్రేట్ వెల్లడించారు. మరో ఏడు రోజుల పాటు మహాకుంభ్ జరగనున్నదని, దాని కోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉంచినట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం యంత్రాంగం నిర్విరామంగా పనిచేస్తోందన్నారు. ఎక్కడ కూడా రైల్వే స్టేషన్లను మూసివేయలేదన్నారు. దరాగంజ్లో ఉన్న ప్రయాగ్ సంగం స్టేషన్ మాత్రమే మూసినట్లు చెప్పారు. మేళా ప్రాంతానికి సమీపంలో ఉన్న కారణంగా, ఆ స్టేషన్‌ను క్లోజ్ చేసినట్లు తెలిపారు.
మేళా కారణంగా ఏ విద్యార్థి కూడా బోర్డు పరీక్షలను మిస్ కాలేదన్నారు.