SKM Calls Off Protests | పంజాబ్, హర్యానాల్లో ఆదివారం నుంచి వరి ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. దీంతో తమ నిరసనలను రద్దు చేసుకున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) శనివారం తెలిపింది. ఇది కలిసి కట్టుగా రైతులు చేసిన ఉద్యమం సాధించిన విజయం అని ఎస్కేఎం ఓ ప్రకటనలో వివరించింది. ఇంతకుముందు అక్టోబర్ 11 వరకు ధాన్యం సేకరణ జరుగదని కేంద్రం తెలిపింది. కేంద్రం వైఖరిని నిరసిస్తూ.. తక్షణం ధాన్యం సేకరణ ప్రారంభించాలంటూ శనివారం పంజాబ్, హర్యానాల్లో రైతులు నిరసనలకు దిగారు.
రైతుల నిరసన నేపథ్యంలో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర వినియోగ వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ వ్యవస్థ శాఖల సహాయ మంత్రి అశ్విని కుమార్ దూబేను కలుసుకుని దీనిపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆ వెంటనే కేంద్ర మంత్రి అశ్విని కుమార్ స్పందిస్తూ.. పంజాబ్, హర్యానాల్లో ఆదివారం నుంచి ధాన్యం సేకరణ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.