Samrat Choudhary : బిహార్ నూతన సీఎంగా బీజేపీ నేత సామ్రాట్ చౌదరి ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్యసభకు ఎంపికైన నితీష్ కుమార్ తన సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఆయన తర్వాత ఎన్డీయే కూటమి నుంచి బీజేపీ నేత సీఎంగా ఎన్నికవుతారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. నితీష్ తర్వాత బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి సీఎంగా ఎన్నికవుతారు.
నితీష్ కుమార్ మంగళవారం, ఏప్రిల్ 14న ఉదయం 11 గంటలకు క్యాబినెట్ మీటింగ్ నిర్వహించబోతున్నారు. పాట్నాలో జరిగే ఈ సమావేశం అనంతరం ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేస్తారు. అనంతరం ఎన్డీయే లెజిస్లేటర్ల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఎన్డీయే నూతన లెజిస్లేచర్ పార్టీ నేతను ఎన్నుకుంటారు. ఆ నేత బిహార్ సీఎంగా ఎన్నికవుతారు. అయితే, సీఎం పదవికోసం అందరిలోకి ఎక్కువగా వినిపిస్తున్న పేరు సామ్రాట్ చౌదరి. ఆయన బీజేపీలో సీనియర్ నేత. ప్రస్తుత బిహార్ డీసీఎం. 2023లో బిహార్ బీజేపీ అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికి డిప్యూటీ సీఎం అయ్యారు. ఓబీసీలోని కొయేరి సామాజికవర్గానికి చెందిన సామ్రాట్ చౌదరినే బీజేపీ అధిష్టానం సీఎంగా ఎంపిక చేసిందని తెలుస్తోంది. ఇంతకాలం ఎన్డీయే కూటమిలో కీలకంగా ఉన్న జేడీయూ అధినేత నితీష్ కుమార్ సీఎంగా కొనసాగారు. ఆయన రాజ్యసభకు వెళ్తుండటంతో ఇప్పుడు రాష్ట్రానికి బీజేపీ తరఫున సీఎం పదవి చేపడుతారు.
మంగళవారం బీజేఎల్పీ సమావేశం కూడా జరగనుంది. ఈ సమావేశంలో సామ్రాట్ చౌదరి ఎంపికను ప్రకటించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలకుడిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ నుంచి సామ్రాట్ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనదే. ఏప్రిల్ 14న నితీష్ గవర్నర్కు రాజీనామా సమర్పిస్తే.. 15న సామ్రాట్ చౌదరి సీఎం పదవి చేపడతారు. ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరగనుంది. దీనికి ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా హాజరవుతారు.