
న్యూఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీకి (ఎస్పీ) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎస్పీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి శతరుద్ర ప్రకాష్ శుక్రవారం కాషాయ పార్టీలో చేరారు. యూపీ బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ సమక్షంలో ప్రకాష్ బీజేపీలో చేరారు.
బెనారస్ హిందూ యూనివర్సిటీలో విద్యార్ధిగా ఉన్నప్పుడే రాజకీయాల్లో చేరిన ప్రకాష్ 1974లో వారణాసి కంటోన్మెంట్ నుంచి సోషలిస్ట్ పార్టీ అభ్యర్ధిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆపై లోక్‌దళ్, జనతాపార్టీ అభ్యర్ధిగా అదే నియోజకవర్గం నుంచి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు.
ములాయం సింగ్ యాదవ్ యూపీ సీఎంగా ఉన్న సమయంలో ఆయన క్యాబినెట్లో ప్రకాష్ క్యాబినెట్ మంత్రిగా వ్యవహరించారు. కాశీ విశ్వనాధ్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా మోదీపై ప్రకాష్ ప్రశంసలు గుప్పించడంతో ఆయన కాషాయ పార్టీకి చేరువవుతారని భావించారు.