Railway Station | న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట ఘటన తర్వాత అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లోని కౌంటర్లో ప్లాట్‌ఫారమ్ టికెట్ల విక్రయాలను నిలిపివేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని.. వచ్చేవారం వరకు న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో సాయంత్రం 4 గంటల నుంచి 11 గంటల వరకు ప్లాట్‌ఫారమ్ టికెట్ల విక్రయాలను నిలిపివేయాలను అధికారులు నిర్ణయించారు. రెండురోజుల కిందట న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట జరిగి 18 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత రైల్వేస్టేషన్లో కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
స్టేషన్ మొత్తం భద్రతా బలగాలను మోహరించారు. రైల్వేల భద్రత కోసం మెట్రో భద్రతలో నిమగ్నమైన సీఐఎస్ఎఫ్ కంపెనీ బలగాలను సైతం తరలించారు. ఢిల్లీ పోలీస్ ట్రాన్స్పోర్ట్ రేంజ్ జాయింట్ సీపీ విజయ్ సింగ్ స్వయంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వెళ్లి భద్రతా ఏర్పాట్ల బాధ్యతలను పర్యవేక్షించారు. ఢిల్లీ సీపీ సంజయ్ అరోరా ఆదివారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో భద్రతా కోసం ఎనిమిది కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించినట్లు జాయింట్ సీపీ విజయ్ సింగ్ పేర్కొన్నారు. 80 మంది జవాన్లతో కూడిన మెట్రో పోలీస్ కంపెనీని సైతం మోహరించినట్లు పేర్కొన్నారు. మెట్రో నుంచి ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ఒక ఏసీపీకి బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. అలాగే రైల్వే పోలీస్, జీఆర్పీల ప్రత్యేక జవాన్లను సైతం స్టేషన్లో మోహరించారు.
రైల్వే పోలీస్‌కు చెందిన ఎనిమిది నుంచి పది స్టేషన్ హెడ్లను.. ఢిల్లీ పోలీస్ సమీప ప్రాంతాల స్టేషన్ హెడ్లను కూడా మోహరించారు. ప్రతి ప్లాట్‌ఫారమ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, వెలుపల ఒక కంపెనీని మోహరించినట్లు జాయింట్ పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. ఒక కంపెనీలో 80 నుంచి 85 మంది సైనికులు ఉంటారు. ఇక రైల్వేస్టేషన్ వెలుపల, రోడ్డపై పెద్ద సంఖ్యలో పోలీస్ సిబ్బందిని మోహరించగా.. స్టేషన్‌కు సమీపంలో వాహనాలను అనుమతించడం లేదు. కుంభమేళాకు రైళ్లన్నీ 12, 13, 14 ప్లాట్‌ఫారమ్స్ నుంచి బయలుదేరుతాయని పేర్కొన్నారు. ప్లాట్‌ఫారమ్‌లపై పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించగా.. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే రైళ్లపై ప్రత్యేక నిఘా వేసి ఉంచారు.