Saif Ali Khan attack case | ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు మహ్మద్ షారిఫుల్ ఇస్లాం షేహ్జాద్కు బంద్రా హాలీడే కోర్టు ఆదివారం ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా దేశంలోకి చొరబడిన మహ్మద్ షారిఫుల్ ఇస్లాం షేహ్‌జాద్.. సైఫ్ అలీఖాన్‌పై దాడి చేశాడని పోలీసులు ధృవీకరించారు. దొంగతనం చేసేందుకు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి నిందితుడు చొరబడిన సంగతి తెలిసిందే. ఈ కేసు పరిష్కారం కోసం పోలీసులు పలు దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు.
నిందితుడిపై భారతీయ న్యాయ్ సంహిత (బీఎన్ఎస్)లోని 311, 312, 331(4), 331 (6), 331 (7) సెక్షన్ల కింద నిందితుడిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సైఫ్ అలీఖాన్‌పై దాడికి దిగిన నిందితుడు తన సొంతూరికి పారిపోయేందుకు ప్రయత్నించాడని పోలీసులు ఆరోపించారు. అయితే ఠాణెలోని హీరానందానీ ఎస్టేట్‌లో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు బంగ్లాదేశ్‌లోని ఝాలోకటి జిల్లా వాసి అని పోలీసులు చెప్పారు. సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటన విషయమై స్టాఫ్ నర్సు అలేయమ్మ ఫిలిప్ (56) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం మెరుగైందని, ఐసీయూ నుంచి నార్మల్ రూమ్‌కు మార్చారని లీలావతి హాస్పిటల్ వెల్లడించింది.