Supreme Court | సహారా గ్రూప్ కంపెనీల భవిష్యత్తుకు సంబంధించి ఓ కీలక పరిణామం చోటు చేసుకున్నది. కంపెనీ పాలసీ మేకర్స్ ఈ గ్రూప్ ఆస్తులను అదానీ ప్రాపర్టీస్ లిమిటెడ్‌కు విక్రయించేందుకు సన్నాహలు చేస్తున్నారు. ఇందుకు అనుమతి కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మహారాష్ట్రలోని అంబీ వ్యాలీ, లక్నోలోని షహరా సిటీతో సహా వివిధ ఆస్తులను అదానీ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించడానికి అనుమతి కోరుతూ సహారా ఇండియా కమర్షియల్ కార్పొరేషన్ లిమిటెడ్ (SICCL) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై అక్టోబర్ 14న విచారణ జరిగే అవకాశం ఉన్నది. న్యాయవాది గౌతమ్ అవస్థి దాఖలు ఈ పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 6 నాటి టర్మ్ షీట్లో పేర్కొన్న నిబంధనలు, షరతులపై గ్రూప్ ఆస్తులను అదానీ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది సహరా గ్రూప్.
పెండింగ్‌లో ఉన్న సహారా గ్రూప్ కేసుల్లో దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తులో కోర్టు ఎప్పటికప్పుడు జారీ చేసిన వివిధ ఆదేశాలకు అనుగుణంగా.. అనుమతి పొందిన తర్వాత ఎస్‌ఐసీసీఎల్, సహారా గ్రూప్ కొన్ని చరాస్తులు, స్థిరాస్తుల అమ్మకాలను చాలా కష్టంతో చేయగలిగాయని తెలిపింది. ఈ నిధులను సెబీ-సహారా రీఫండ్ ఖాతాలో జమ చేశారు. మొత్తం రూ.24,030 కోట్ల ప్రిన్సిపల్ మొత్తంలో సహారా గ్రూప్ తన చరాస్తులు, స్థిర ఆస్తుల అమ్మకం, లిక్విడేషన్ ద్వారా సుమారు రూ.16వేల కోట్లు సేకరించి, సెబీ-సహారా రీఫండ్ ఖాతాలో జమ చేసింది అని తెలిపింది. ఎస్టేట్ బ్రోకరేజ్ కంపెనీల సేవలను ఉపయోగించినప్పటికీ సహారా గ్రూప్ ఆస్తులను లిక్విడేట్ చేయడం, విక్రయించడంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అసమర్థతను ఎత్తి చూపుతూ.. సెబీ-సహారా రీఫండ్ ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని చాలా కష్టంతో, దరఖాస్తుదారు, సహారా గ్రూప్ ప్రయత్నాల ద్వారా జమ చేశామని ఎస్‌ఐసీసీఎల్ తెలిపింది.
నవంబర్ 2023లో సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ మరణం తర్వాత.. గ్రూప్ తన ఏకైక నిర్ణయాధికారిని కోల్పోయిందని ఎస్‌ఐసీసీఎల్ పేర్కొంది. ఆయన తన జీవితకాలంలో గ్రూప్ తరఫున అన్ని నిర్ణయాలు తీసుకున్నారని.. దివంగత సుబ్రతా రాయ్ కుటుంబ సభ్యులు సహారా గ్రూప్ రోజువారీ వ్యాపార కార్యకలాపాలు, నిర్వహణలో పాల్గొనలేదని.. అయితే పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడాలనే కుటుంబ సభ్యుల కోరికను దృష్టిలో ఉంచుకుని సహారా గ్రూప్ ఆస్తులను సాధ్యమైనంత ఎక్కువ ధరకు విక్రయించాలని.. ఈ కోర్టు జారీ చేసిన ఆదేశాలను పాటించాలని, సహారా గ్రూప్ బాధ్యతలను తీర్చాలని, ప్రస్తుత ధిక్కార చర్యలను ముగించాలని నిర్ణయించినట్లుగా పిటిషన్లో పేర్కొంది. వాటాదారుల ప్రయోజనాల కోసం, ముఖ్యంగా సహారా గ్రూప్ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌ఐసీసీఎల్ తెలిపింది.
ఎస్‌ఐసీసీఎల్ ప్రకారం.. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, ఆచరణీయమైన ఆఫర్లు లేకపోవడం, అనేక పెండింగ్ వ్యాజ్యాల కారణంగా ఈ ప్రయత్నాలు ఎలాంటి సానుకూల ఫలితాలను ఇవ్వలేదని.. ఇది సమష్టిగా కొనుగోలుదారుల విశ్వాసాన్ని దెబ్బతీసిందని, ఆస్తుల మార్కెట్ సామర్థ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేసిందని తెలిపింది. దివంగత సుబ్రతా రాయ్ కుటుంబ సభ్యులు, సహారా గ్రూప్, ఇతర సీనియర్ అధికారులపై బహుళ దర్యాప్తు సంస్థలు విచారణలు ప్రారంభించడం ద్వారా ప్రయత్నాలు మరింత క్లిష్టంగా మారాయని ఎస్‌ఐసీసీఎల్ పేర్కొంది. తాము పేర్కొన్నవన్నీ సమాంతర, సమన్వయం లేని చర్యలు పెట్టుబడిదారులు, డిపాజిటర్ల మనసులో గందరగోళం, విరుద్ధమైన కథనాలు, అవసరమైన అనుమానాలను సృష్టించడమే కాకుండా సహారా గ్రూప్ తన ఆస్తులను డబ్బు ఆర్జించడానికి, కోర్టు ఆదేశాలను పాటించడానికి చేస్తున్న ప్రయత్నాలను సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయని పిటిషన్లో పేర్కొంది.