SACOF | ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య నైరుతి రుతుపవనాల సమయంలో భారత్ సహా దక్షిణాసియాలోని చాలా ప్రాంతాల్లో సగటు కంటే ఎక్కువగానే వర్షాపాతం నమోదవుతుందని సౌత్ ఏషియన్ క్లైమేట్ అవుట్‌లుక్ ఫోరం (SACOF) తెలిపింది. ఈ ప్రాంతాల్లో వర్షం అంతా ఒకేలా ఉండదని.. ఉత్తర, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో కొన్ని చోట్ల సగటు కంటే తక్కువ వర్షాపాతం నమోదు కావచ్చని చెప్పింది. ఈ సంవత్సరం ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని డేటా పేర్కొంది. తొమ్మిది దేశాల వాతావరణ సంస్థలు కలిసి ఈ డేటాను సిద్ధం చేశాయి. భారత్, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవులు, మయన్మార్ వాతావరణశాఖలు సంయుక్తంగా ఈ డేటాను తయారు చేశాయి. వ్యవసాయం, జలశక్తి తదితర సున్నితమైన రంగాలకు రుతుపవనాల సీజన్ గురించి ఖచ్చితమైన సమాచారం ముఖ్యమని నివేదిక పేర్కొంది.
దాని సహాయంతో మెరుగైన ప్రణాళికను రూపొందించడమే కాకుండా.. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవచ్చని తెలిపింది. వర్షాలు ఉపశమనం కలిగించినా.. అధిక వర్షాల కారణంగా వరదలు, కొండ చరియలు విరిగిపడడం, ఇతర ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతాయని నివేదిక తెలిపింది. గతంలో దక్షిణాసియాలో ప్రతి సంవత్సరం రుతుపవన సంబంధిత విపత్తులు వేలాది మంది ప్రాణాలను బలిగొంటున్నాయని, బిలియన్ల డాలర్ల విలువైన ఆస్తులకు నష్టం కలిగిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో నిపుణులు స్పందిస్తూ.. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో, లా నినా పరిస్థితులు లేవని.. ఇది రుతుపవనాలపై వాటి ప్రభావం పరిమితంగా ఉంటుందని పేర్కొన్నారు. అదే సమయంలో హిందూ మహాసముద్ర డైపోల్ (IOD) పరిస్థితుల పర్యవేక్షణ కీలకమని.. ఎందుకంటే ఇది భారత ఉపఖండం వాతావరణాన్ని అలాగే ఆఫ్రికా, ఆస్ట్రేలియాను ప్రభావితం చేస్తుందని నిపుణులు పేర్కొన్నారు.