ముంబై: భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ బీసీసీఐ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నాడా? వయో పరిమితి నిబంధనల కారణంగా బోర్డు అధ్యక్షుడు రోజర్ బిన్నీ (70) ఆ పదవి నుంచి వైదొలగగా రాజీవ్ శుక్లా ప్రస్తుతం ఆ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈనెల 28న ముంబైలో జరగాల్సి ఉన్న బీసీసీఐ ఏజీఎంలో అధ్యక్షుడితో పాటు పలు కీలక పదవులకు ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడిగా మాస్టర్ బ్లాస్టర్‌ను ఎన్నుకోనున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
అయితే టెండూల్కర్ టీమ్ మాత్రం ఈ వార్తలను ఖండించింది. ఈ మేరకు సచిన్ టీమ్ స్పందిస్తూ.. ‘బీసీసీఐ ప్రెసిడెంట్‌గా సచిన్ పోటీ చేస్తున్నాడని, ఆ పోస్టుకు నామినేట్ అయ్యాడని వస్తున్న పుకార్లు మా దృష్టికి వచ్చాయి. ప్రస్తుతానికి సచిన్ అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు’ అని తెలిపింది. ఇవన్నీ పుకార్లేనని స్పష్టం చేసింది.