హాంకాంగ్: యువ భారత షట్లర్ ఆయుష్ శెట్టి హాంకాంగ్ ఓపెన్‌లో మరో సంచలన ప్రదర్శన చేశాడు. గురువారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఈ కర్నాటక కుర్రాడు.. 21-19, 12-21, 21-14తో జపాన్ స్టార్ షట్లర్, మాజీ ప్రపంచ రెండో ర్యాంకర్ కొడాయ్ నరొకకు షాకిచ్చి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. ఈ ఏడాది జూన్‌లో యూఎస్ ఓపెన్ సూపర్ 300 టైటిల్ గెలిచిన ఆయుష్.. 72 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో నరొకను చిత్తుచేశాడు.
తొలి గేమ్‌లో 13-15తో వెనుకబడ్డప్పటికీ పదునైన స్మాష్‌లతో అతడు 21-19తో ఆ గేమ్‌ను గెలుచుకున్నాడు. కానీ నరొక జోరు పెంచడంతో రెండో గేమ్ అతడి సొంతమైంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో భారత కుర్రాడు దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగాడు. 17-10తో ఉండగా నరొక చేసిన తప్పిదాలను తనకు అనుకూలంగా మలుచుకుని గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకున్నాడు.
ఇద్దరు భారత షట్లర్లు లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ మధ్య సాగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సేన్‌నే విజయం వరించింది. ప్రిక్వార్టర్స్‌లో అతడు.. 15-21, 21-18, 21-10తో ప్రణయ్‌ను ఓడించాడు. క్వార్టర్స్‌లో సేన్.. ఆయుష్‌ను ఢీకొననున్నాడు. పురుషుల డబుల్స్‌లో ప్రపంచ 9వ ర్యాంకర్లు సాత్విక్-చిరాగ్.. 18-21, 21-15, 21-11తో సుక్పున్-తీరరత్సకుల్ (థాయ్‌లాండ్)ను చిత్తు చేసి క్వార్టర్స్ చేరారు.