Modi 3.0 : మోదీ ప్రభుత్వం వరుసగా మూడోసారి కేంద్రంలో కొలువుతీరిన తొలి వంద రోజుల పాలనలో చేసిందేమీ లేదని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ అన్నారు. అన్ని మంత్రిత్వ శాఖలకు తాము 100 రోజుల కార్యాచరణ అజెండా నిర్ధారించుకున్నామని బీజేపీ ఆర్భాటంగా చెబుతూ వచ్చినా వాస్తవానికి చేసింది శూన్యమని మండిపడ్డారు. సచిన్ పైలట్ శుక్రవారం రాజస్ధాన్‌లోని టాంక్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.రాజ్యాంగ పదవిలో ఉన్న లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీని బెదిరిస్తున్న నేతలను కూడా కాషాయ పాలకులు వారించకపోవడం వారి స్వభావాన్ని, ఆలోచనా ధోరణిని ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించారు.
తొలి వంద రోజుల్లో వారు లేటరల్ ఎంట్రీ, వక్ఫ్ సవరణ బిల్లు చేపట్టినా రెండింటిపై యూటర్న్ తీసుకున్నారని అన్నారు. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ నేపధ్యంలో ప్రజల దృష్టి మరల్చేందుకు జమిలి ఎన్నికలకు క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్ అనే వార్తలను తెరపైకి తెచ్చారని, ఈ నిర్ణయంపైనా కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటుందని అన్నారుఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినా ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఉత్తరాది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే జమిలి ఎన్నికలను తెరపైకి తీసుకొచ్చారని అంతకుముందు పైలట్ ఆరోపించారు.
ఎన్నో అంశాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సి ఉన్నా పార్లమెంట్లో తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో యూటర్న్ తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. ప్రస్తుత పార్లమెంటరీ వ్యవస్ధలో జమిలి ఎన్నికలు సాధ్యమయ్యే పని కాదని, క్యాబినెట్లో ఆమోదించినంత మాత్రాన అమలు అంత సులభం కాదని వ్యాఖ్యానించారు. వీరు గత నిర్ణయాలపై యూటర్న్ తీసుకున్న తరహాలోనే జమిలి ఎన్నికలపైనా యూటర్న్ తీసుకుంటారని అన్నారు.జమ్ము కశ్మీర్లో తొలి దశ పోలింగ్‌లో బీజేపీ పూర్తిగా వెనుకబడిందని, హరియాణలో సైతం కాషాయ పార్టీది ఇదే పరిస్ధితని పేర్కొన్నారు.
Read More :