Sabarimala | ఢిల్లీ: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో బంగారు తాపడాల దొంగతనం కేసులో సుప్రీంకోర్టు కఠిన వ్యాఖ్యలు చేసింది. “నువ్వు దేవుడిని కూడా వదిలిపెట్టలేదు. కనీసం దేవాలయాన్ని, దేవుడిని వదిలిపెట్టవలసింది” అని చెప్పింది. దేవస్థానం బోర్డు మాజీ సభ్యుడు కేపీ శంకర్ దాస్ దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది.
అయ్యప్ప స్వామి దేవాలయంలోని బంగారు వస్తువులు, తాపడాలను ఎలక్ట్రోప్లేటింగ్, మరమ్మతుల కోసం పంపించారు. వీటిలో బంగారు పూత గల రాగి వస్తువులు, ఇతర కళాఖండాలు ఉన్నాయి. పనులు పూర్తయిన తర్వాత ఈ వస్తువులను తిరిగి దేవాలయానికి చేర్చారు. వీటిలోని బంగారం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ బంగారాన్ని కాజేసి, అమ్మేసి ఉంటారని దర్యాపు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి ఈ దేవాలయానికి సంబంధించిన బంగారాన్ని తన వ్యక్తిగత ప్రయోజనం కోసం మళ్లించినట్లు ఆరోపించింది. కేరళ హైకోర్టు ఇటీవల జరిపిన విచారణ సందర్భంగా, ఈ కేసులో నిందితులు శంకర్ దాస్, కే విజయ్ కుమార్ నేరపూరిత కుట్ర ఆరోపణల నుంచి తప్పించుకోలేరని చెప్పింది.