బెంగళూరు: రష్యాకు చెందిన మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి దట్టమైన అడవిలోని గుహలో చాలా కాలం నివసిస్తున్నది. (Russian Woman Living In Cave) ఇటీవల అక్కడ గస్తీ నిర్వహించిన పోలీసులు వీరిని గమనించారు. విషపూరిత పాములు, మృగాలతో పాటు కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ఆ ప్రాంతం నుంచి వారిని తరలించారు. కర్ణాటకలోని గోకర్ణలో ఈ సంఘటన జరిగింది. దట్టమైన అటవీ ప్రాంతంలోని రామతీర్థ కొండపై ఉన్న ప్రమాదకర గుహలో రష్యా మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నది. జూలై 9న పర్యాటకుల భద్రత కోసం గోకర్ణ పోలీసులు రామతీర్థ కొండ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి గుహలోని గుడిసెలో నివసిస్తున్న రష్యా మహిళ, ఆమె కుమార్తెలను గమనించారు.
కాగా, రష్యా మహిళను 40 ఏళ్ల నీనా కుటినా, ఇద్దరు కుమార్తెలను 6 ఏళ్ల ప్రేమ, 4 ఏళ్ల అమాగా పోలీసులు గుర్తించారు. ఆమెను ప్రశ్నించగా గోవా నుంచి ఇక్కడకు చేరుకుని గుహలో ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నట్లు తెలిపింది. పాస్‌పోర్ట్, వీసా పత్రాలు ఆ గుహలో ఎక్కడో పోయినట్లు చెప్పింది. అయితే ఆ ప్రాంతం ప్రమాదకరమని పోలీసులు తెలిపారు. రష్యా మహిళ అభ్యర్థన మేరకు బంకికోడ్ల గ్రామంలోని మహిళా సన్యాసి యోగరత్న సరస్వతి ఆశ్రమానికి తొలుత వారిని తరలించారు.
మరోవైపు గోకర్ణ పోలీసులు, అటవీ శాఖ అధికారులు కలిసి ఆ గుహలో సోదా చేయగా రష్యా మహిళ పాస్‌పోర్ట్, వీసా పత్రాలు లభించాయి. 2017 ఏప్రిల్ 17 వరకు గడువు ఉన్న బిజినెస్ వీసాపై నీనా భారత్‌కు వచ్చినట్లు వాటి ద్వారా తెలిసింది. 2018 ఏప్రిల్ 19న గోవాలోని విదేశీ కార్యాయలం భారత్ నుంచి వెళ్లిపోవాలని ఆమెకు చెప్పింది. దీంతో నేపాల్ వెళ్లిన రష్యా మహిళ అదే ఏడాది సెప్టెంబర్ 8న తిరిగి భారత్‌కు వచ్చినట్లు ఆమె రికార్డుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు.
కాగా, వీసా నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో రష్యా మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలను కార్వార్‌లోని మహిళా రిసెప్షన్ సెంటర్‌కు పోలీసులు తరలించారు. వారిని రష్యాకు తిరిగి పంపేందుకు బెంగళూరులోని విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని సంప్రదించినట్లు ఉత్తర కన్నడ పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Man’s Phone Snatched | వ్యక్తి మొబైల్ ఫోన్ లాక్కెళ్లిన అగంతకుడు.. బయటపడిన భార్య వివాహేతర సంబంధం
Watch: తృణమూల్ నేత, బీజేపీ నాయకురాలు కలిసి.. కారులో మద్యం తాగిన వీడియో వైరల్