కీవ్, మార్చి 30: శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉంటామని హామీనిచ్చి 24 గంటలు గడువక ముందే రష్యా యూటర్న్ తీసుకొన్నది. కీవ్, చెర్నిహివ్ నగరాలపై చేస్తున్న దాడులను తగ్గించేందుకు అంగీకరిస్తున్నామని ప్రకటించిన పుతిన్ సేనలు బుధవారం ఆయా ప్రాంతాల్లో దాడులను మరింత ఉద్ధృతం చేశాయి. జనావాసాలు, దుకాణాలు, లైబ్రరీలు అని తేడా లేకుండా బాంబుల వర్షం కురిపించాయి. తూర్పు ప్రాంత నగరం ఇజ్యూమ్, డొనెట్స్క్లో కూడా క్షిపణి దాడులు జరిగినట్టు అధికారులు తెలిపారు. టర్కీలోని ఇస్తాంబుల్లో మంగళవారం జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు.
పశ్చిమ రష్యాలోని బెల్గొరోడ్ ప్రాంతంలోని ఆయుధ డిపోపై మంగళవారం రాత్రి ఉక్రెయిన్ క్షిపణుల వర్షం కురిపించినట్టు డెయిలీ మెయిల్ ఓ కథనంలో వెల్లడించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 40 లక్షల మందికి పైగా ఉక్రెయిన్లు శరణార్థులుగా దేశం నుంచి తరలి వెళ్లినట్టు ఐక్యరాజ్యసంస్థ శరణార్థుల ఏజెన్సీ తెలిపింది.