న్యూఢిల్లీ, మార్చి 11 : జనాభా ప్రాతిపదికన జరిగే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ర్టాలు తీవ్రంగా నష్టపోతాయని ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభలో నిరసనకు దిగారు. వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన చేయడంతో మంగళవారం సభ పలుమార్లు వాయిదా పడింది. నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ర్టాల ఆందోళనలను చర్చించడానికి సభా కార్యకలాపాలను పక్కనపెట్టాలని కోరుతూ 267 నిబంధన కింద ప్రతిపక్ష ఎంపీలు నోటీసులు ఇవ్వగా వాటిని డిప్యుటీ చైర్మన్ హరివంశ్ తోసిపుచ్చడంతో సభ్యులు నిరసన తెలిపారు. అయితే జీరో అవర్లో డీఎంకే సభ్యుడు ఆర్ గిరిరాజన్ ఈ అంశాన్ని లేవనెత్తుతూ కుటుంబ నియంత్రణను అమలు చేసిన కేరళ, తమిళనాడు, పంజాబ్ వంటి రాష్ర్టాలు పార్లమెంటరీ స్థానాలను కోల్పోనుండగా కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను పట్టించుకోకుండా జనాభాను పెంచుకున్న ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ర్టాలు అధిక పార్లమెంటరీ స్థానాలు పొందనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం రేగింది. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే విద్యా శాఖ పనితీరుపై చర్చను ప్రారంభించాలని కాంగ్రెస్ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ను హరివంశ్ కోరారు. అదేసమయంలో జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ నల్ల చొక్కాలతో హాజరైన డీఎంకే సభ్యులు మంత్రి ప్రధాన్ క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న ఖర్గే.. ఉదయం తాను మాట్లాడేటప్పుడు ప్రధాన్ సభలో లేరన్నారు. కేంద్రం నిరంకుశంగా ప్రవర్తిస్తున్నదన్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధంగా ఉన్నాయన్న అర్థం వచ్చేలా ఓ హిందీ పదాన్ని వాడారు. ఇది అభ్యంతరకరంగా ఉన్నదని అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే తాను ఆ వ్యాఖ్యలు సభాపతిని ఉద్దేశించి చేసినవి కావని ఖర్గే వివరణ ఇచ్చారు.