న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కోసం జరుగుతున్న ప్రజాధనం దుర్వినియోగంపై తాజా వివాదం రాజుకుంది. ‘కేవలం 12 గంటల కోసం ప్రధాని మోదీ సౌదీ పర్యటనకు రూ. 15 కోట్లు ఖర్చు అయింది’ అని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. మహారాష్ట్రకు చెందిన సమాచార హక్కు(ఆర్టీఐ) కార్యకర్త అజయ్ బసుదేవ్ బోస్ అడిగిన ప్రశ్నకు జెడ్డాలోని భారత కాన్సులేట్ జనరల్ ఈ మేరకు సమాధానమిచ్చింది. గంటకు 1.25 కోట్ల చొప్పున ఖర్చు పెట్టారంటే గుండె మండుతోందని, కేవలం 12 గంటల కోసం మొత్తం హోటల్ని రూ. 10.2 కోట్లకు బుక్ చేశారని, ఇది దేశానికి భారీ నష్టమేనని కాంగ్రెస్ తన పోస్టులో పేర్కొంది.
ఏప్రిల్‌లో పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రధాని మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకున్నారు. ఇందుకు అయిన ఖర్చు రూ. 15.54 కోట్లు అని ఆర్టీఐ జవాబు పేర్కొంది. ఇందులో కేవలం హోటల్ బుకింగ్‌ల కోసమే రూ. 10.2 కోట్లు ఖర్చయింది. జెడ్డాలో కొన్ని గంటలు ఉన్నందుకు ఇంత భారీ స్థాయిలో ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేయడం అసాధారణమని ఆర్టీఐ కార్యకర్త బోస్ విలేకరుల వద్ద వ్యాఖ్యానించారు. హోటల్ బుకింగ్‌ల కోసం రూ.10 కోట్ల మేరకు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయడం దిగ్భ్రాంతికరమని ఆయన చెప్పారు. ఈ ఆడంబరాలపై మోదీని ఎవరైనా ప్రశ్నించగలరా అని ఎక్స్‌లో ఆయన ప్రశ్నించారు.