తిరువనంతపురం: సీపీఎం రాష్ట్ర స్థాయి సమావేశాలు ఇవాళ కేరళలోని కొల్లాంలో ప్రారంభం అయ్యాయి. ఆ సమావేశాన్ని మాజీ నేత ప్రకాశ్ కారత్(Prakash Karat) ప్రారంభించారు. తన ప్రారంభోపన్యాసంలో ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని నియో-ఫాసిస్ట్ ప్రభుత్వంగా ఆయన పేర్కొన్నారు. తమ పార్టీ రూపొందించిన రాజకీయ తీర్మాన ముసాయిదాలో .. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని నియో-ఫాసిస్ట్‌గా అభివర్ణించామని తెలిపారు. ప్రస్తుతం ఆ సర్కారు ఫాసిస్ట్ కాదు అని, ఆ ప్రభుత్వం నియో-ఫాసిస్ట్ విధానాలను ప్రదర్శిస్తున్నట్లు విమర్శించారు. తాజా రాజకీయ పరిస్థితిని వివరించేందుకు తొలిసారి ఆ పదాన్ని వాడినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి దేశంలోనూ ఫాసిస్ట్ శక్తులు ఉంటాయని, ఓ గ్రూపును వాళ్లు శత్రువుగా భావిస్తారని, వాళ్ల మైనార్టీలు, శరణార్థులు కావొచ్చు అని, అయితే భారత్‌లో ఆర్ఎస్ఎస్కు చెందిన హిందూత్వ ఐడియాలజీ ఓ భిన్నమైందని, అందుకే దాన్ని నియో-ఫాసిస్ట్‌గా నామకరణం చేసినట్లు ప్రకాశ్ కారత్ తెలిపారు.
తన ప్రసంగంలో మోదీ కన్నా ఎక్కువగా ట్రంప్‌పై విరుచుకుపడ్డారు కారత్. 19వ శతాబ్ధపు సామ్రాజ్యవాది ట్రంప్ అని విమర్శించారు. ఎన్నో ఎన్నో రాజ్యాలను సొంతం చేసుకోవాలని ట్రంప్ చూస్తున్నట్లు ఆరోపించారు. గ్రీన్‌ల్యాండ్, పనామా కెనాల్, కెనడా, గాజా స్ట్రిప్‌లపై ట్రంప్ కన్నేశారని, ఆ ప్రయత్నాలను ప్రకాశ్ కారత్ తప్పుపట్టారు. ట్రంప్ తరహాలో మోదీ ఇజ్రాయిల్‌కు మద్దతు ఇచ్చారని, దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకాశ్ కారత్ తెలిపారు. ఒకవేళ ట్రంప్ విధానాలకు మోదీ పచ్చజెండా ఊపితే, అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇండియాకు కష్టాలు ఎదురవుతాయన్నారు. ట్రంప్ విదేశాంగ విధానాలను వ్యతిరేకించిన సీపీఎం నేత.. ఇటీవల జెలెన్స్కీతో జరిగిన భేటీలో అమెరికా అధ్యక్షుడు ప్రవర్తించిన తీరును మాత్రం ఖండించలేకపోయారు.