న్యూఢిల్లీ, జనవరి 2: ఏఐ చాట్‌బాట్ గ్రోక్ ద్వారా సృష్టించిన అశ్లీల వీడియోలు, ఫొటోలను 72 గంటల్లోగా తొలగించి సవివరంగా తీసుకున్న చర్యలపై నివేదికను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు సమర్పించాలని ఎక్స్‌కు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. గ్రోక్‌పై మహిళల అశ్లీల ఫొటోలు, వీడియోలను సులభంగా సృష్టించి షేర్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ శివసేన(యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాసిన నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ఐటీ చట్టం, 2000, ఐటీ(ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నిబంధనలు, 2021 కింద ఎక్స్ అనుసరించాల్సిన చట్టబద్ధమైన బాధ్యతల్లో తీవ్రమైన లోపాలను తాము గుర్తించినట్లు తెలిపింది.
గ్రోక్ ఏఐ ద్వారా మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకుని అశ్లీల ఫొటోలు, వీడియోలు సృష్టించడంపై మంత్రిత్వశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టవిరుద్ధమైన కంటెంట్ సృష్టిని అడ్డుకునేందుకు గ్రోక్‌కు చెందిన సాంకేతిక, విధానపరమైన, పాలనా స్థాయి విధానాలను సమగ్రంగా సమీక్షించవలసిందిగా ఎక్స్‌ని మంత్రిత్వశాఖ ఆదేశించింది. తన సేవా నిబంధనలను, ఏఐ వాడకం విధానాలను కఠినంగా అమలు చేయాలని ఎక్స్‌ని ఆదేశించిన కేంద్రం.. గ్రోక్ ఏఐని దుర్వినియోగం చేస్తున్న యూజర్ల అకౌంట్లను నిలిపివేయడం లేదా తొలగించడం వంటి కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.