GST | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ ప్లాట్‌ఫామ్‌లు డెలివరీ ఫీజు కింద 18 శాతం కొత్తగా జీఎస్టీ వసూలు చేయడం మొదలుపెట్టడంతో కొత్త జీఎస్టీ రేట్లు అమలులోకి రావడానికి ముందుతో పోలిస్తే వినియోగదారులకు ఆర్థిక భారం పెరిగింది. అయితే వర్షం వచ్చినపుడు ఫుడ్ డెలివరీ చేయాల్సి వస్తే వర్షం ఫీజు కింద రూ. 25తోపాటు అదనంగా 18 శాతం జీఎస్టీ వసూలు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇక సూర్యకాంతి సౌకర్యం ఫీజు, ఆక్సిజన్ కాపాడుతున్నందుకు ఫీజు, గాలి పీలుస్తున్నందుకు ఫీజు వంటివి వడ్డించడమే తరువాయని నెటిజన్లు కేంద్రానికి చురకలు అంటించారు. ఓ నెటిజన్ తాను ఆన్లైన్లో తెప్పించుకున్న ఫుడ్ బిల్లు స్క్రీన్‌షాట్ పోస్టు చేశాడు. అందులో రెస్టారెంట్ జీఎస్టీ 14.75, డెలివరీ రెయిన్(వర్షం) ఫీజు రూ.25 ప్లస్ రూ. 4.50 జీఎస్టీ, రెస్టారెంట్ ప్యాకేజింగ్ రూ.20, ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.14.99 అని ఉన్నాయి. అయితే వర్షం ఫీజుపైనే నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇక వర్షంలో వచ్చే ఆర్డర్‌కు రూ. 25 అదనంగా కట్టాల్సిందేనంటూ పలువురు నెటిజన్లు వాపోయారు. కొందరు మాత్రం వర్షంలో ఫుడ్ డెలివరీ చేసినందుకు ఆమాత్రం ఫీజు అదనంగా చెల్లిస్తే నష్టమేమీ లేదంటూ కొందరు సానుకూలత వ్యక్తం చేశారు.