చండీగఢ్, మే 27 : అప్పుల భారం ఒకే కుటుంబంలోని ఏడుగురిని చిదిమేసింది. రుణ ఊబిలో కూరుకుని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన హర్యానాలోని పంచకులలో వెలుగుచూసింది. ఇందులో ఆరుగురు కారులోనే మరణించగా, ఒకరు దవాఖానకు తరలిస్తుండగా మరణించారు. మృతులను 41 ఏండ్ల ప్రవీణ్ మిట్టల్, అతని భార్య, ముగ్గురు మైనర్ పిల్లలు (అందులో ఇద్దరు అమ్మాయిలు కవలలు), అతని తల్లిదండ్రులుగా పోలీసులు గుర్తించారు.
డెహ్రాడూన్‌లో ఒక ఫ్యాక్టరీని నడిపిన మిట్టల్ అందులో భారీ నష్టం రావడంతో బ్యాంక్ వారు అతని ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో తాము చేసిన 15-20 కోట్ల రుణాన్ని తీర్చలేకే వీరు బలవన్మరణానికి పాల్పడ్డారని భావిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక కారు పంచకుల సెక్టార్ 27లోని నివాస ప్రాంతంలో సోమవారం రాత్రి పార్కు చేసి ఉంది. రాత్రి 10 గంటలకు అందులోని ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. బతికి ఉన్న మిట్టల్‌ను దవాఖానకు తరలిస్తుండగా మధ్యలోనే మరణించాడు. అందరూ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నామని పంచకుల డీసీపీ తెలిపారు.