న్యూఢిల్లీ, డిసెంబర్ 12: దేశంలో మొట్టమొదటిసారి కులగణనతో సహా చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణ-2027కు రూ.11,728 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్ర క్యాబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. దేశంలో మొదటిసారి డిజిటల్ పద్ధతిలో సెన్సస్ నిర్వహించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ఆమోదించిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకరులకు తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియలో దాదాపు 30 లక్షల మంది ఎన్యూమరేటర్లు పాల్గొంటారని ఆయన చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 16వ సారి జరగనున్న సెన్సస్‌లో ప్రజలు స్వచ్ఛందంగా తమ వివరాలు తెలియచేసే అవకాశం కూడా ఉందని ఆయన తెలిపారు. దశాబ్దానికోసారి జరగాల్సిన సెన్సస్ ప్రక్రియ 2021లో జరగాల్సి ఉండగా దేశవ్యాప్తంగా ప్రబలిన కొవిడ్ కారణంగా వాయిదా పడింది.
రెండు దశలలో సెన్సస్
సెన్సస్‌ని రెండు దశలలో నిర్వహించనున్నట్లు వైష్ణవ్ తెలిపారు. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ జరుగుతుంది. జనాభా వివరాల సేకరణ 2027 ఫిబ్రవరిలో ఉంటుంది. లద్ధాఖ్‌తోపాటు జమ్ముకశ్మీరులోని హిమపర్వత ప్రాంతాలు, హిమాచల్, ఉత్తరాఖండ్‌లో జనాభా లెక్కల వివరాల నమోదు ప్రక్రియ 2026 సెప్టెంబర్‌లో నిర్వహిస్తారని మంత్రి తెలిపారు. 30 లక్షల మంది ఎన్యూమరేటర్లు ఈ ప్రక్రియలో పాల్గొంటారని చెప్పారు.
నరేగా పేరు మార్పునకు క్యాబినెట్ ఓకే
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(నరేగా) పేరును మార్చి పని దినాల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర క్యాబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ పథకం పేరును పూజ బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజనగా మార్చడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు వర్గాలు తెలిపాయి. పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడానికి కూడా క్యాబినెట్ ఆమోదించింది.
ఉన్నత విద్య రెగ్యులేటర్ బిల్లుకు ఆమోదం
యూజీసీ, ఏఐసీటీఈ వంటి సంస్థల స్థానంలో ఒకే ఉన్నత విద్య నియంత్రణ వ్యవస్థను నెలకొల్పేందుకు ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత బిల్లుకు గతంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని నామకరణం చేయగా ఇప్పుడు ఆ పేరును వికసిత్ భారత్ శిక్షా అధీక్షణ్ బిల్లుగా మార్చారు.
అణు విద్యుత్తు రంగంలోకి ప్రైవేట్
అణు ఇంధన సామర్థ్యాన్ని 2047 నాటికి 100 గిగావాట్లకు పెంచాలని లక్ష్యం పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం పౌర అణు విద్యుత్తు రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానించే బిల్లుకు శుక్రవారం ఆమోదం తెలిపింది. సస్టెయినబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా(శాంతి) బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.