న్యూఢిల్లీ: మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే తన పుస్తకంలో రాసుకున్న వ్యాఖ్యలను ఇవాళ రాహుల్ గాంధీ(Rahul Gandhi) పార్లమెంట్లో ప్రస్తావించారు. దీంతో లోక్‌సభలో రగడ నెలకొన్నది. ప్రచురణ కాని పుస్తకం నుంచి రాహుల్ వ్యాఖ్యలు చేస్తున్నారని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. కేంద్ర బడ్జెట్‌పై జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. అయితే చైనా అంశంపై మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే తన పుస్తకంలో రాసుకున్న వ్యాఖ్యలను రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఓ మ్యాగజైన్లో ప్రచురించిన పేజీలను ఆయన సభలో చూపించారు. తన వాదనను నిజం చేసే రీతిలో ఆ ప్రస్తావన ఉన్నట్లు రాహుల్ పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలను అధికార పక్షం వ్యతిరేకించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షా జోక్యం చేసుకుని.. ఇంతకీ రాహుల్ చెప్పున్న ఆ బుక్ పబ్లిష్ అయ్యిందా లేదా అని ప్రశ్నించారు.
హౌజ్ రూల్స్‌ను రాహుల్ గాంధీ ఉల్లంఘించినట్లు రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. ప్రచరణ జరగని పుస్తకాన్ని ఉద్దేశిస్తూ ఎలా వ్యాఖ్యానిస్తారని ఆయన ప్రశ్నించారు. ఆ పుస్తకంలో ఎంత వాస్తవం ఉందో ఎలా తెలుస్తుందని ఆయన అన్నారు. ఆ సమయంలో రాహుల్, రాజ్‌నాథ్ మధ్య వాగ్వాదం జరిగింది. చాలా విశ్వసనీయ సమాచారాన్ని తాను ప్రస్తావిస్తున్నట్లు రాహుల్ తెలిపారు. అయితే ఏ పుస్తకం నుంచి ఆ వ్యాఖ్యలను తీసుకున్నారో.. ఆ పుస్తకాన్ని సభలో ప్రవేశపెట్టాలని రాజ్‌నాథ్ డిమాండ చేశారు. ప్రతిపక్ష పక్ష నేత రాహుల్ ఆ బుక్‌ను సభలో ప్రవేశపెట్టాలని ఆయన అన్నారు.
రాహుల్ గాంధీకి అండగా అఖిలేశ్ యాదవ్ మాట్లాడారు. చైనా అంశంపై చర్చించేందుకు రాహుల్‌కు అవకాశం ఇవ్వాలని అఖిలేశ్ కోరారు. చైనా అంశం చాలా సున్నితమైందని, సభలో ఆ అంశంపై సీరియస్‌గా చర్చ జరగాలన్నారు. జాతీయ భద్రత, విదేశీ విధానంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో లోక్‌సభ ప్రతిపక్ష నేతను అడ్డుకోరాదన్నారు. సభా వ్యవహారాలు సాగుతున్న సమయంలో మ్యాగిజైన్ లేదా వార్తాపత్రికల ఆర్టికల్స్‌ను సభ్యులు ప్రస్తావించరాదు అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. అయితే ఇండో-చైనా సంబంధాలపై మాట్లాడే హక్కు తనకు ఉందని, ఏ నిబంధనలు తనను అడ్డుకోలేవని రాహుల్ గాంధీ అన్నారు. చైనాతో సంబంధాలపై మాట్లాడేందుకు ఏం రూల్స్ అడ్డు ఉన్నాయో చెప్పాలని రాహుల్ స్పీకర్‌ను కోరారు.
గందరగోళం నేపథ్యంలో లోక్‌సభను 3 గంటల వరకు వాయిదా వేశారు.