భువనేశ్వర్: ఒడిశాలోని బాహానాగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో గత శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో (Odisha train crash) ధ్వంసమైన కోచ్ నుంచి దుర్వాసన వస్తున్నట్లు స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ధ్వంసమైన ఆ రైలు బోగీలో మృతదేహాలు ఇంకా ఉండవచ్చని, అవి కుళ్లడం వల్లనే ఈ దుర్వాసన వస్తున్నట్లు ఆరోపించారు. రైళ్ల ప్రమాదం తర్వాత కొంత మంది ప్రయాణికుల ఆచూకీ తెలియకపోవడంతో ప్రమాద సంఘటనా స్థలం సమీపంలో నివసిస్తున్న జనం ఈ మేరకు అనుమానాలు వ్యక్తం చేశారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రమాదంలో ధ్వంసమైన రైలు కోచ్‌లను మరోసారి పరిశీలించారు. ఆ దుర్వాసనకు కారణం ఏమిటన్నది తెలుసుకున్నారు. ధ్వంసమైన రైలు బోగీల్లో ఎలాంటి మృతదేహాలు లేవని తూర్పు రైల్వే సీపీఆర్వో ఆదిత్య కుమార్ చౌదరి తెలిపారు. దీనికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ నుంచి రెండుసార్లు క్లియరెన్స్ పొందినట్లు చెప్పారు.
మరోవైపు ప్రమాదానికి గురైన యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ పార్సిల్ వ్యాగన్లో మూడు టన్నుల గుడ్లు ఉన్నాయని ఆదిత్య కుమార్ తెలిపారు. ఆ గుడ్లు కుళ్లడంతో దుర్వాసన వస్తున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో పార్సిల్ వ్యాగన్లో ఉన్న మూడు టన్నుల గుడ్లను మూడు ట్రాక్టర్ల ద్వారా రైలు ప్రమాద స్థలం నుంచి తరలించినట్లు వివరించారు. కాగా, గత శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 288 మంది మరణించగా, వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. కాళ్లు, చేతులు కోల్పోయిన వందలాది మంది వికలాంగులయ్యారు.