Inspirational Story | దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. రెండు చేతులు, రెండు కాళ్లు.. కానీ.. ఏదైనా సాధించాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాం. లక్ష్యాన్ని చేరుకోవడానికి అపసోపాలు పడుతాం. కానీ.. ఓ యువకుడు మాత్రం రెండు చేతులు, ఒక కాలు లేకున్నా.. తను అనుకున్నది సాధించాడు. నేడు వేల మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతడే ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలిచాడు. పదండి.. ఆయన గురించి ఆయన మాటల్లోనే ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం.
నాపేరు రోషన్ నగర్. మాది రాజస్థాన్. నాకు ఏమైందో చెప్పుకునే ముందు.. మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మన జీవితంలో ఏం జరిగినా అది మన మంచికోసమే. అవును.. ఇప్పుడు నేను కూడా అదే నమ్ముతున్నాను. నాకు రెండు చేతులు, ఒక కాలు లేదు. అయినా కూడా అది నామంచి కోసమే అనిపిస్తుంది. జీవితంలో కష్టపడే వాడికే దేవుడు ఎక్కువ కష్టాలు ఇస్తాడట. దేవుడు ఎన్ని కష్టాలు ఇచ్చినా కష్టపడండి.. ఓర్చుకోండి.. ఎప్పుడూ మీ లక్ష్యాన్ని వదిలేయకండి.. ఖచ్చితంగా విజయం మీ బానిస అవుతుంది.
ఇక.. నా గురించి చెప్పాలంటే.. నేను చిన్నప్పుడు అందరు పిల్లల్లా చాలా అల్లరి చేస్తూ పెరిగాను. నాకు పతంగులు ఎగురవేయడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు నేను మా ఇంటి డాబాపైన కూర్చున్నా. అదే సమయంలో ఓ పతంగి అటు వైపు ఎగురుకుంటూ వచ్చింది. దాన్ని ఎలాగైనా పట్టుకోవాలనుకున్నా. అది చెట్టుకొమ్మలో చిక్కుకుంది. నేను దాన్ని ఎలాగైనా తీసుకోవాలని ఆరాటపడ్డా. దీంతో ఒక కర్రను తీసుకున్నా. కానీ.. ఆ కర్ర చిన్నగా ఉండటంతో పతంగి తీయడం కష్టమైంది. పక్కనే ఓ ఐరన్ రాడ్ కనిపించింది. వెంటనే దాన్ని తీసుకొని పైకి లేపబోయా. అంతే నా మీదనే ఉన్న 36 కేవీ హైటెన్షన్ వైరుకు ఆ రాడ్ తగిలింది. అంతే క్షణాల్లో నేను కుప్పకూలిపోయా. నాకు ఏం జరిగిందో నాకే అర్థం కాలేదు.
కట్ చేస్తే.. నేను ఆసుపత్రిలో ఉన్నాను. ఎలక్ట్రిక్ షాక్ వల్ల నా రక్త నాళాలు అన్నీ చిట్లిపోయాయి. నా శరీరంలో రక్త ప్రసరణ కూడా ఆగిపోయింది. రక్త ప్రసరణ కావడం కోసం డాక్టర్లు శతవిధాలా ప్రయత్నించారు. కానీ.. అది వర్కవుట్ కాలేదు. దీంతో మరో ఆప్షన్ లేక.. నా రెండు చేతులు.. ఒక కాలు తీసేయాల్సి వచ్చింది. అయినా కూడా నేను బతుకుతానో లేదో డౌటే అన్నారు డాక్టర్లు.
కానీ.. బతకాలన్న ఆశ నన్ను బతికించింది. నన్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మరో 6 నెలల పాటు ఇంట్లోనే ట్రీట్మెంట్. రోజూ ఉదయమే నాకు డ్రెస్సింగ్ చేయడం.. ఆ సమయంలో వచ్చే నొప్పిని భరించలేక నేను అరవడం.. నా అరుపులు విని చుట్టుపక్కన ఉండే వాళ్లు మా ఇంటికి పరిగెత్తుకురావడం.. 6 నెలలు ఇదే తంతు.
ఇక నాకు అర్థం అయిపోయింది. నేను జీవితాంతం ఇలాగే బతకాలని.. అందుకే అప్పుడే నిర్ణయించుకున్నా. ఇక నేను నా లక్ష్యాల మీద గురి పెట్టాలని. ఈ అంగవైకల్యం నాకు ఏ విషయంలో కూడా అడ్డు రాకూడదనుకున్నా. తీసేయగా మిగిలిన చేయితోనే రాయడం నేర్చుకున్నా. అలాగే ప్రాక్టీస్ చేశా. అలాగే.. 10, 12 బోర్డ్ పరీక్షలు రాశా. ఎవ్వరి సహాయం తీసుకోకుండా 10, 12 తరగతుల్లో పాస్ అయ్యా. ఆ తర్వాత డిగ్రీ చేశా. అప్పుడు అసలు ప్రశ్న ఎదురైంది.
ఇప్పుడు ఏం చేయాలి. నా లాంటి వ్యక్తికి ఉద్యోగం ఎవరు ఇస్తారు అనుకున్నా. అంగవైకల్యం కేటగిరీలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేశా. కానీ.. నాకు అంగవైకల్యం శాతం ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగానికి పనికిరానన్నారు. దీంతో ఓ ప్రైవేటు కంపెనీలో చేరా. కొన్ని రోజుల తర్వాత అక్కడ పనిచేయలేకపోయా.
చేతులు, కాళ్లు లేకుండా జీవితంలో నెగ్గుకురావాలంటే అంత ఈజీ కాదు. ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకా ఏదో చేయాలనుకున్నా. అందుకే.. ఎలక్ట్రానిక్ చేతులు పెట్టించుకుందామనుకున్నా. దాని కోసం 13 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో కొన్ని ఎన్జీవోలను ఆశ్రయించా. వాళ్లే నాకు రెండు ఎలక్ట్రానిక్ చేతులను అమర్చేందుకు డబ్బును సమకూర్చారు.
ఇప్పుడు నాకు రెండు చేతులు వచ్చేశాయి. సొంతంగా ఒక ఇన్స్టిట్యూషన్ను స్టార్ చేశాను. యువతకు సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ నేర్పిస్తుంటా. అలాగే.. ఉద్యోగ అవకాశాలపై కూడా యూత్‌కు అవగాహన కల్పిస్తుంటా. ఇటీవలే నాకు రాజస్థాన్ క్షేత్రీయ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. అసిస్టెంట్ మేనేజర్‌గా బ్యాంక్‌లో చేరా. నేను ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగిని. అలాగే.. నేను మంచి రచయితను కూడా. మోటివేషనల్ స్పీకర్‌ను కూడా. యూత్‌కు మోటివేషనల్ పాఠాలు చెబుతూ వాళ్లను సరైన కెరీర్ దిశగా వెళ్లేందుకు ప్రోత్సహిస్తున్నందుకు నాకు రాజస్థాన్ ప్రభుత్వంతో పాటు పలు ఇన్స్టిట్యూషన్స్ సత్కరించాయి.
మన జీవితంలో వచ్చే చిన్న చిన్న సమస్యలకు కొందరు సతమతమయిపోతుంటారు. ప్రతి మనిషి జీవితంలో ఎత్తుపల్లాలు కామన్. కానీ.. ఎప్పుడు సమస్యలను చూసి భయపడొద్దు. వెనక్కి తిరగొద్దు. అప్పుడే మీరు అనుకున్నది సాధిస్తారు. ఇక ఉంటాను మరి. సెలవు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆ ఊరిపెద్ద భారత్‌లో భోజనం చేస్తాడు.. మయన్మార్‌లో నిద్రపోతాడు!
రూ. 3.3 లక్షల టిప్ అందుకున్న మహిళ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు ఆపై ఏమైందంటే..!
Thomas Alva Edison | ప్రపంచానికి వెలుగునిచ్చిన ఎడిసన్ కంట కన్నీరు తెప్పించిన ఆ లెటర్
రెండు చేతులు, ఒక కాలు లేకున్నా పోల్ డ్యాన్సర్‌గా పాపులర్ అయింది.. వీడియో వైరల్