Robert Vadra : ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. హరియాణాలోని వివాదాస్పద షిఖోపూర్ ల్యాండ్ డీల్ కేసులో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై రాబర్ట్ వాద్రాకు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసును విచారిస్తున్న ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ఆధారంగా స్పెషల్ జడ్జ్ సుశాంత్ చంగోత్రా విచారణ జరిపారు.
మే 16న కోర్టులో హాజరు కావాలని వాద్రాకు ఆదేశాలు జారీ చేశారు. ఈడీ గత ఏడాది జూలైలో ఈ కేసుపై చార్జిషీట్ దాఖలు చేసింది. వాద్రాపై దాఖలైన తొలి ఛార్జిషీటు ఇదే. ఈ అంశంలో గత ఏడాది ఏప్రిల్లోనే ఈడీ వాద్రాను విచారించింది.
షిఖోపూర్ ల్యాండ్ డీల్ ఏంటి..?
ఈ కేసు 2008 ఫిబ్రవరికి సంబంధించింది. అప్పట్లో హరియాణాలో భూపిందర్ సింగ్ హుడా ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండేది. ఆ సమయంలో రాబర్ట్ వాద్రా డైరెక్టర్గా ఉన్న స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ప్రభుత్వం తక్కువ ధరకే భూమి కట్టబెట్టింది. రూ.7.5 కోట్లకే 3.5 ఎకరాల భూమిని అందించింది. అయితే, ఈ భూమిని ఆ సంస్థ 2012లో డీఎల్ఎఫ్ సంస్థకు రూ.58 కోట్లకు అప్పగించింది. తక్కువ ధరకు భూమి దక్కించుకుని, ఎక్కువ ధరకు విక్రయించడంలో ఆర్థిక మోసాలు జరిగాయని, మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపిస్తూ ఈడీ కేసు నమోదు చేసింది.
ఈ విషయంలో వాద్రాకు ఉన్న సంబంధాలు, లావాదేవీలపై ఈడీ విచారణ జరుపుతోంది. దీనిలో భాగంగా వాద్రా, అతడి కంపెనీలకు సంబంధించి రూ.37.64 కోట్ల విలువైన 43 ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. అయితే, ఈ కేసు విచారణపై వాద్రా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తనపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని ఆరోపిస్తున్నారు.