Robert Vadra : హర్యానా (Haryana) భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు (Money laundering case) విచారణ నిమిత్తం కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వాయనాడ్ ఎంపీ (Wayanad MP) ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) భర్త.. రాబర్ట్ వాద్రా (Robert Vadra) బుధవారం మరోసారి ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన వెంట ప్రియాంక కూడా ఈడీ కార్యాలయం వరకు వెళ్లారు.
కాగా ఈ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి వాద్రా ఈడీ మంగళవారం నోటీసులు జారీ చేసి తమముందు హాజరుకావాలని ఆదేశించింది. నోటీసులు అందిన వెంటనే ఆయన నడుచుకుంటూ ఈడీ కార్యాలయానికి వెళ్లారు. దాదాపు ఐదు గంటలపాటు ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. బుధవారం కూడా హాజరుకావాలని ఆదేశించడంతో ఇవాళ మళ్లీ వెళ్లారు. వాద్రా లోపలికి వెళ్తుండగా అప్పటిదాక ఆయనతోపాటు ఉన్న ప్రియాంక భర్తను ఆలింగనం చేసుకున్నారు.
దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం వాద్రాను అధికారులు విచారిస్తున్నారు. ప్రియాంకను ఈడీ కార్యాలయంలోని వెయిటింగ్ రూమ్లో కూర్చోబెట్టారు. విచారణకు హాజరయ్యే ముందు వాద్రా ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వ తప్పిదాలను బయటకు చెప్పేవారిపై ఈడీతో సహా ఇతర ఏజెన్సీలు దాడులు చేస్తున్నాయని ఆరోపించారు.
ప్రభుత్వ తీరును దేశంలోని ప్రతిఒక్కరూ గమనిస్తున్నారని, ఈ ఏజెన్సీలపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోందని వాద్రా అన్నారు. అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలా చేస్తున్నారని చెప్పారు. తనపై చేస్తున్న తప్పుడు ఆరోపణలకు వ్యతిరేకంగా తాను పోరాటం చేస్తున్నానని, ప్రజలు తనతోనే ఉన్నారని, వారు తనను రాజకీయాల్లో చూడాలనుకుంటున్నారని వాద్రా తెలిపారు.
ఇదిలావుంటే ఈడీ ప్రకారం.. వాద్రా కంపెనీ 2008 ఫిబ్రవరిలో గుర్గావ్లోని షికోపూర్లో 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్ ప్రాపర్టీ నుంచి కొనుగోలు చేసింది. దీని విలువ రూ.7.5 కోట్లు. ఆ తర్వాత వాద్రా కంపెనీ ఆ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన డీఎల్ఎఫ్కు రూ.58 కోట్లకు విక్రయించింది. డీఎల్ఎఫ్కు రూ.58 కోట్ల భారీ లాభంతో విక్రయించడంతో మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈడీ విచారిస్తోంది.