Rahul Saibaba | భారత్ జోడో యాత్ర చేపడుతున్న రాహుల్‌గాంధీని ఆయన బావ రాబర్ట్ వాద్రా ఆకాశానికెత్తేశారు. రాహుల్‌ను ఏకంగా షిర్డీ సాయిబాబాతో పోల్చారు. రాహుల్ ఆలోచనా విధానం అచ్చం సాయిబాబా మాదిరిగానే ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. రాహుల్ పాదయాత్రతో దేశం మార్పును చవిచూడటం ఖాయమని చెప్పారు. రాహుల్‌తోపాటు ప్రియాంక కూడా ఇప్పటినుంచి ఫుల్‌టైమ్ రాజకీయాల్లో కొనసాగుతారన్నారు. సాయిబాబాను దర్శించుకునేందుకు షిర్డీ వచ్చిన ఆయన ఈ మేరకు ఈ వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను ఆయన బావ రాబర్ట్ వాద్రా ప్రశంసల్లో ముంచెత్తారు. దేశ ప్రజలంతా ఒక్కటే అని, ఏకత్వాన్ని బోధించిన షిర్డీ సాయిబాబా ఆలోచనల మాదిరిగానే రాహుల్ ఆలోచనలు ఉన్నాయన్నారు. రాహుల్‌కు బాబా ఆశీస్సులు లభిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. జోడో యాత్ర దేశంలో మార్పును తీసుకువస్తుందని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు రాహుల్ వెంట నడుస్తూ కాంగ్రెస్ భవిష్యత్‌కు ఆశాజనకంగా ఉన్నారన్నారు.
బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల గురించి మాట్లాడుతున్నదని, కాంగ్రెస్‌ను హేళన చేస్తున్నదని రాబర్ట్ వాద్రా చెప్పారు. ఇప్పుడు రాహుల్, ప్రియాంకలు బీజేపీని నిలువరించేందుకు నడుం బిగించడంతో వారి ఆటలిక సాగవు అని అన్నారు. ప్రజల మధ్య ఉండి వారి కోసం ఐక్యంగా పనిచేస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గేతో కాంగ్రెస్ మరింత ముందుకెళ్తుందని అభిప్రాయపడ్డారు. ఇలాఉండగా, రాజస్థాన్‌కు చెందిన మంత్రి పర్సాదీలాల్ మీనా ఇప్పటికే రాహుల్‌ను రాముడితో పోల్చారు.