Road Accidents | యుద్ధం, తిరుగుబాటు, నక్సలిజం కంటే భారత్‌లో రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్ర రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఫిక్కరీ రోడ్ సేఫ్టీ అవార్డ్స్ – కాన్క్లేవ్ 2024 ఆరో ఎడిషన్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రోడ్ ప్రాజెక్టుల పేలవమైన వివరణాత్మక ప్రాజెక్ట్‌ల నివేదికల (DPS) కారణంగా బ్లాక్‌స్పాట్స్ సంఖ్య పెరుగుతోందన్నారు. యుద్ధం, తిరుగుబాటు, నక్సలిజం వంటివాటి కంటే రోడ్డు ప్రమాదాల్లోనే జనం మరణిస్తున్నారన్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం 5 లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయని.. 1.5లక్షల మంది మరణిస్తున్నారన్నారు. మూడులక్షల మంది గాయపడ్డారన్నారు. దేశ జీడీపీలో మూడుశాతం నష్టమన్నారు. ప్రమాదాల్లో డ్రైవర్లను బలిపశువులను చేస్తున్నారన్నారు. ప్రమాదాలకు రోడ్ ఇంజినీరింగ్ కారహన్నారు. అన్ని రహదారులపై సేఫ్టీ ఆడిట్ నిర్వహించాల్సిన అవసరాన్ని గడ్కరీ నొక్కి చెప్పారు.
అంబులెన్స్‌లు, వాటి డ్రైవర్ల కోసం రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఓ కోడ్‌ని సిద్ధం చేస్తుందని చెప్పారు. తద్వారా ప్రమాద బాధితులను త్వరితగతిన రక్షించేందుకు కట్టర్లు తదితర ఆధునిక యంత్రాలను ఉపయోగించేలా శిక్షణ ఇవ్వవచ్చన్నారు. అంబులెన్స్‌లలో ఈ పరికరాలు ఉండవని.. దీంతో ప్రమాదాల్లో చిక్కుకున్న బాధితులను రక్షించడంలో మూడుగంటల వరకు జాప్యం జరుగుతోందన్నారు. అవసరమైన పరికరాలను గుర్తించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లను సంప్రదించామని, వాటి వినియోగంపై పారామెడిక్స్‌కు శిక్షణ ఇస్తామని గడ్కరీ చెప్పారు. 2025 నుంచి అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలతో కూడిన బస్సులను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. ఈ నిర్ణయం బస్సుల తయారీలో ప్రబలంగా ఉన్న పద్ధతులను పరిష్కరిస్తుందన్నారు. ఈ మార్పు ప్రజా రవాణా భద్రతా ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంటుందన్నారు. ఇంజినీరింగ్ కాలేజీలు, ఐఐటీలు రోడ్ సేఫ్టీ ఆడిట్లను నిర్వహించేందుకు పరిశ్రమలు స్పాన్సర్ చేయాలని మంత్రి ప్రతిపాదించారు.