జైపూర్, అక్టోబర్ 29: రాజస్థాన్‌లో జాట్ పార్టీగా పేరుపొందిన హనుమాన్ బేణివాల్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ(ఆర్ఎల్పీ), బీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ(ఏఎస్పీ) మధ్య పొత్తు కుదిరింది. ఈ జాట్-దళిత్ కలయిక అసెంబ్లీ ఎన్నికల్లో 40కి పైగా స్థానాల్లో ప్రభావం చూపే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో గణనీయ సంఖ్యలో జాట్లు, దళితుల ఓట్లు ఉన్నాయి.
రాజస్థాన్ జనాభాలో దాదాపు 10 శాతం జాట్లు ఉండగా, దళితులు దాదాపుగా 18 శాతం ఉంటారని అంచనా. కనీసం రాష్ట్రంలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ కమ్యూనిటీ ఆధిపత్యం ఉంటుందని, పలు ఇతర స్థానాల్లో కూడా ప్రభావం చూపుతుందని రాజస్థాన్ జాబ్ మహాసభ గతంలో పేర్కొన్నది. తాజాగా ఆర్ఎల్పీ, ఏఎస్పీ పొత్తు ప్రకటన సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌కు బలమైన ప్రత్యామ్నాయం అవసరమని, రైతులు, జవాన్లు, దళితులు కలిసి రావాలని అన్నారు. కాగా, ఆజాద్ సమాజ్ పార్టీ ప్రధానంగా రాష్ట్రంలోని బీఎస్పీ ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టింది.
ఆ ఓట్లపైనే ప్రధాన దృష్టి
2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన 3.56 కోట్ల ఓట్లలో దాదాపు 76 లక్షల ఓట్లు(21.34 శాతం) అటు బీజేపీకి గానీ, ఇటు కాంగ్రెస్‌కు పడలేదు. ఇప్పుడు ఈ ఓట్లపైనే ఆర్ఎల్పీ, ఏఎస్పీ కూటమి ప్రధానంగా దృష్టి పెట్టింది. గత ఎన్నికల్లో 58 స్థానాల్లో పోటీచేసిన ఆర్ఎల్పీకి మొత్తంగా 8.5 లక్షల ఓట్లు వచ్చాయి. మూడు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, వారిలో ఇద్దరు దళితులే. ఇక రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి సారిగా బరిలోకి దిగిన ఏఎస్పీ.. సొంతంగా కొన్ని స్థానాల్లోనే పరిమితంగా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు మొదట అంచనా వేశారు. అయితే ఇప్పుడు ఆర్ఎల్పీ, ఏఎస్పీ జట్టు కట్టిన నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌లకు ఈ జాబ్-దళిత్ కలయిక దెబ్బ కొట్టే అవకాశం లేకపోలేదని పేర్కొంటున్నారు.