పట్నా: బీహార్లోని మొకామా అసెంబ్లీ స్థానంలో బీజేపీ ఓటమి ఖాయమయ్యింది. 20 రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి సోనమ్ దేవీపై ఆర్జేడీ అభ్యర్థి నీలమ్ దేవి 66,587 ఓట్ల భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అంటే నీలమ్ విజయం దాదాపు ఖాయమై పోయింది. కౌంటింగ్ ప్రారంభం నుంచి కూడా ఏ ఒక్క రౌండ్లోనూ బీజేపీ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. ఏకపక్షంగా ఆర్జేడీ అభ్యర్థి ఆధిక్యం కొనసాగుతూ వచ్చింది.
కాగా, ఫలితాల సరళిపై నీలమ్ దేవి స్పందించారు. తన గెలుపు ముందు ఊహించిందేనని ఆమె చెప్పారు. తనతో ఎవరూ పోటీలో కూడా నిలువలేరని ముందు చెప్పిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. మొకామా పరుషురాముడి స్వస్థలమని, ఇక్కడి ప్రజలు ప్రలోభాలకు లొంగరని ఆమె వ్యాఖ్యానించారు. అందుకే ఆర్జేడీకి భారీ ఆధిక్యం కట్టబెట్టారని చెప్పారు.