పట్నా: రాష్ట్రీయ జనతాదల్ పార్టీకి (ఆర్జేడీకి) మంచి భవిష్యత్తు ఉన్నదని ఆ పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఆర్జేడీ 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇవాళ పట్నాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో లాలూప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీదేవి ఇతర నాయకులు, కార్యకర్తలతో కలిసి వేడుక జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన లాలూ.. భవిష్యత్తులో దేశాన్ని ముందుకు నడిపించేది తమ పార్టేనని చెప్పారు.
తనకు ఐదుగురు ప్రధాన మంత్రులతో కలిసి పనిచేసిన అనుభవం ఉన్నదని లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. తాను చాలాకాలం పాటు కేంద్రమంత్రిగా పనిచేశానని, కానీ ఏనాడూ తాను ఆ పదవి కోసం పాకులాడలేదని చెప్పారు. రాబోయే రోజుల్లో తామే దేశాన్ని ముందుకు నడిపిస్తామన్నారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం దేశ ప్రజల వెన్ను విరుస్తున్నదని, భవిష్యత్తులో ఈ అన్ని సమస్యలను ఆర్జేడీ పరిష్కరిస్తుందని లాలూ వ్యాఖ్యానించారు.