పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో లోక్తాంత్రిక్ జనతాదళ్ (ఎల్జేడీ) విలీనం 2019లోనే జరుగాల్సి ఉందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తెలిపారు. అయితే ఈ ప్రక్రియ కొంత ఆలస్యమైందని చెప్పారు. ఎల్జేడీని ఆర్జేడీలో విలీనం చేయాలన్న శరద్ యాదవ్ నిర్ణయం ప్రజల డిమాండ్ అని ఆయన అన్నారు. ఈ విలీనం సరైన సమయంలో జరిగిందని, ఇతర ప్రతిపక్షాలకు సందేశం ఇచ్చిందన్నారు.
కాగా, 25 ఏండ్ల తర్వాత శరద్ యాదవ్ తన పార్టీని లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్లో విలీనం చేశారు. లోక్ తాంత్రిక్ జనతాదళ్ను ఆర్జేడీలో విలీనం చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. విపక్షాల ఏకీకరణకు ఈ విలీనం నాంది అని అభివర్ణించారు. కేంద్రంలోని బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని ఈ సందర్భంగా శరద్ యాదవ్ పిలుపునిచ్చారు.
మరోవైపు బీహార్లోని బెట్టియాలో కస్టడీ మరణంపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ స్పందించారు. ఇది దురదృష్టకరమని అన్నారు. ఇంతకు ముందు కూడా పోలీసులు కస్టడీలో ఉన్న వ్యక్తులను చంపారని విమర్శించారు. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో బీహార్లో పరిపాలన అరాచకంగా ఉందని ఆరోపించారు. పోలీసులు తన మాట వినడం లేదని అసెంబ్లీ స్పీకర్ స్వయంగా ప్రకటించిన సంగతిని గుర్తుచేశారు. బీజేపీ-జేడీయూ ప్రభుత్వాన్ని సీఎం నితీశ్ కుమార్ నడపలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.