యాదాద్రి: దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని సినీనటుడు ఆర్. నారాయణమూర్తి కొనియాడారు. యాదగిరి గుట్ట పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 17న విడుదలవుతున్న రైతన్న సినిమా ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అవలంభిస్తున్న రైతు, విద్యుత్ వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ ఈ సినిమా తీశానని క్లారిటీ ఇచ్చారు.
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ అని ఆర్. నారాయణమూర్తి కొనియాడారు. దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా రైతుబంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రైతులకు సాగునీటి కష్టాలను తీర్చారని గుర్తు చేశారు. 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దేశవ్యాప్తంగా 3.50 లక్షల మంది రైతులు అత్మ హత్యలు చేసుకున్నారని అన్నారు. ఇక మోదీ అధికారంలోకి వచ్చాక అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో దేశంలో 75 శాతం ఉన్న వ్యవసాయ రంగం.. 52 శాతానికి తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులను చట్టబద్దత చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై కేంద్రానికి రైతులకు 13 ధపాలుగా చర్చలు జరిగాయని గుర్తు చేశారు. కార్పొరేట్ వ్యవసాయ పద్దతితో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సవరణ చట్టం రైతులకే కాదు, సామాన్య ప్రజలకు గుదిబండలా మారుతుందన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్, సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, మండల కార్యదర్శి బబ్బూరి శ్రీధర్, కొండమ డుగు నర్సింహా, మున్సిపల్ కౌన్సిలర్ దండబోయిన అనిల్, కో ఆప్షన్ సభ్యులు పేరబోయిన పెంటయ్య, బబ్బూరి పోశేటి, కళ్లెం కృష్ణగౌడ్, గోప రాజు, వెంకటేశ్, పేరబోయిన మహేందర్, పుష్ప, పతదితరులు పాల్గొన్నారు.