Maharastra elections : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Assembly Elections) పోలింగ్ తేదీ దగ్గరపడటంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయాల్లో వేడి రాజుకుంటోంది. ఈ క్రమంలో లాతూర్ నుంచి ఎన్నికల బరిలో దిగుతున్న తన సోదరుడు, కాంగ్రెస్ అభ్యర్థి ధీరజ్ దేశ్ముఖ్ (Dhiraj Deshmukh) తరఫున బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ముఖ్ (Riteish Deshmukh) కూడా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన బీజేపీపై విమర్శలు చేశారు. కొంతమంది తమ మతం ప్రమాదంలో ఉందని చెబుతున్నారని, కానీ అక్కడ ప్రమాదంలో ఉన్నది వారి పార్టీయేనని రితేశ్ అన్నారు. అందుకే తమ పార్టీని రక్షించాలని వారు ప్రజలను కోరుతున్నారని, అలాంటి వారు ముందుగా అభివృద్ధి గురించి మాట్లాడేలా ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
మన పని మనం చేసి, ఫలితాన్ని తనకు వదిలేయాలని భగవంతుడు చెప్పాడని, చిత్తశుద్ధితో పనిచేయని వారు మాత్రమే మతం గురించి మాట్లాడతారని ఆయన విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో యువతకు ఉద్యోగ అవకాశాలు లేవని, వారికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని అన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో తన సోదరుడు ధీరజ్ 1.21 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారని, ఈ ఎన్నికల్లోనూ ప్రజలు ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. యువత పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 288 శాసనసభ స్థానాలు కలిగిన మహారాష్ట్రలో అన్ని స్థానాలకు ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెల్లడించనున్నారు.