న్యూఢిల్లీ, జనవరి 26 : అమెరికాలో కఠినమైన వీసా నిబంధనలు, పెరిగిన వీసా ఫీజుల కారణంగా ప్రతిభావంతులు తిరిగి తమ స్వదేశాలకు చేరుకుంటూ అక్కడే ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. గత ఏడాది మూడో త్రైమాసికంలో భారత్‌కు తిరిగి వచ్చిన సాంకేతిక నిపుణుల సంఖ్య 40 శాతం పెరిగినట్టు లింక్డిన్ గణాంకాలను ప్రస్తావిస్తూ అమెరికన్ పెట్టుబడిదారు హ్యానీ గిర్గిస్ పేర్కొన్నారు. కఠినమైన హెచ్-1బీ వీసా నిబంధనలు, లక్ష డాలర్లకు పెరిగిన ఫీజు కారణంగా అమెరికాకు వచ్చే విదేశీ సాంకేతిక నిపుణుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని ఓ వార్తా కథనాన్ని ఆయన ఉదహరించారు. చాలామంది నిపుణులు అమెరికాను వీడి వెళ్లాలని నిర్ణయించుకొంటుండగా, మరికొందరు అసలు రానేకూడదని భావిస్తున్నారని తెలిపారు. ఈ ధోరణి వల్ల ‘అమెరికన్ వీసాలపై ఆధారపడేవారి సంఖ్య తగ్గుతుండగా’, భారత్‌లో ‘స్వదేశీ నిపుణుల సంఖ్య పెరుగుతున్నది’ అని వివరించారు. ఫలితంగా ప్రాపంచిక నైపుణ్యత ‘అదృశ్యం కావడం లేదని.. అది తిరిగి పునఃసమతుల్యత చెందుతున్నది’ అని పేర్కొన్నారు.
భారత్‌కు తిరిగివస్తున్న వారి సంఖ్య నిర్దిష్టంగా తెలియనప్పటికీ ఈ మార్పు వాస్తవమేనని భారత సాంకేతిక సంస్థలు అంగీకరిస్తున్నాయి. స్వదేశీ నిపుణుల వల్ల భారత్ లబ్ధిపొందుతుందనడానికి గిర్గిస్ ఒక ఉదాహరణను ప్రస్తావించారు. భారత్‌కు చెందిన కునాల్ బహల్ పెన్సిల్వేనియా యూనివర్సిటీ పరిధిలోని వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఆ తరువాత ఆయన మైక్రోసాఫ్ట్ సంస్థలో ఇంటర్న్‌గా చేరారు. కానీ ఆయన హెచ్-1బీ వీసా దరఖాస్తును అమెరికా ప్రభుత్వం 2007లో తిరస్కరించింది. దీంతో ఆయన తన 23వ ఏటనే భారత్‌కు తిరిగి వచ్చి మరికొందరితో కలిసి ‘స్నాప్‌డీల్’ అనే ఆన్లైన్ షాపింగ్ సంస్థను స్థాపించారు. ఆ సంస్థ విలువ అతికొద్ది కాలంలోనే 6.5 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. ఇప్పుడు కూడా నిపుణుల తిరుగు పయనంతో భారత్‌కు లాభమే జరుగుతున్నదని వివరించారు. ఒకప్పుడు భారతీయ ఇంజినీర్లకు అమెరికాలో ఉపాధి కల్పించిన సంస్థలు ఇప్పుడు భారత్‌లోనే నిపుణుల బృందాలను తయారుచేస్తున్నాయని అన్నారు.
రివర్స్ మైగ్రేషన్ (తిరుగు వలసలు)కు గిర్గిస్ ఐదు అంశాలను ఎత్తిచూపారు. గత ఏడాది మూడో త్రైమాసికంలో భారత్‌కు తిరిగి వస్తున్న సాంకేతిక నిపుణుల సంఖ్యలో 40శాతం పెరుగుదల. కఠినతరమైన హెచ్-1బీ వీసా నిబంధనలు, అత్యధిక ఫీజుల కారణంగా అమెరికాకు వచ్చే విదేశీ సాంకేతిక నిపుణుల రాకలో తగ్గుదల. విదేశీ ఇంజినీర్లు అమెరికాను వీడాలని నిర్ణయించుకొంటుండగా, కొందరు అమెరికాకు రావడానికే ఇష్టపడకపోవడం. సాంకేతికరంగ ఉద్యోగాలు, సాంకేతిక బృందాలు, పెట్టుబడి స్వదేశానికి రావడంతో భారత్ లాభపడుతున్నది.