PM Modi | భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలపై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా స్పందించారు. రైతుల సంక్షేమం కోసం తాము ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నామని.. రైతుల సంక్షేమం విషయంలో భారత్ ఎప్పుడూ రాజీపడదని స్పష్టం చేశారు. సుంకాల పెంపుతో భారీ మూల్యం చెల్లించాలని నాకు తెలుసునని.. భారమైనప్పటికీ రైతులకు ఎప్పుడూ మద్దతుగా ఉంటామన్నారు. అంతర్జాతీయంగా ఒత్తిడి ఉన్నా గ్రామీణ ప్రాంతాల రక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. ఎంఎస్ స్వామినాథ్ శతజయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గ్రీన్ రివల్యూషన్ పితామహుడు, ప్రముఖ వ్యవసాయశాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ అందించిన సేవలకు గౌరవంగా ఆయన శతజయంతి నేపథ్యంలో ఢిల్లీలోని ఐసీఏఆర్ పూసాలో అంతర్జాతీయ సదస్సు జరగ్గా.. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని మాట్లాడారు.
‘ఎవర్గ్రీన్ రివల్యూషన్ – పాథ్ టు బయో హ్యాపీనెస్’ థీమ్‌తో సదస్సు జరుగుతున్నది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ స్వామినాథన్ జీవితం అంతా అందరికీ ఆహారం అందించాలన్న ఆయన అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. దివంగత ఎంఎస్ స్వామినాథన్ ఆహార భద్రతను తన జీవిత ధ్యేయంగా చేసుకున్నారని, వ్యవసాయ శాస్త్రంలో చేసిన కృషికి ఆయన ఎన్నో ప్రశంసలు అందుకున్నారని ప్రధాని మోదీ అన్నారు. రైతుల ప్రయోజనాలే భారతదేశానికి అత్యంత ప్రాధాన్యత అని, రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాల విఝయంలో భారత్ ఎప్పుడూ రాజీపడబోదని స్పష్టం చేశారు. ఒకే కాలానికి పరిమితం కాదని కొందరు వ్యక్తులు ఉన్నారని.. ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథ్ అలాంటి గొప్ప వ్యక్తని.. ఆయన భూభారతి కుమారుడన్నారు. ఆయన సైన్స్‌ను ప్రజాసేవకు మాధ్యమంగా మార్చారని.. రాబోయే శతాబ్దాల పాటు భారత దేశ విధానాలు, ప్రాధాన్యతలను మార్గనిర్దేశం చేసే చైతన్యాన్ని ఆయన మేల్కొల్పారన్నారు.
స్వామినాథన్ జన శతాబ్ది సమరోహ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్వామినాథ్ గౌరవార్థం స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్‌ను ఆయన ఆవిష్కరించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవమని.. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా చేనేత గుర్తింపు, బలాన్ని పొందిందన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రొఫెసర్ స్వామినాథన్‌తో తనకు చాలా అనుబంధం ఉందని.. గుజరాత్ పూర్వ పరిస్థితులు చాలా మందికి తెలుసునన్నారు. గతంలో కరువు, తుఫానుల కారణంగా వ్యవసాయంలో చాలా సంక్షోభం ఏర్పడిందని.. తాను సీఎంగా ఉన్న సమయంలో సాయిల్ హెల్త్ కార్డ్ పథకంపై ఇద్దరం కలిసి పని చేశామని.. ప్రొఫెసర్ స్వామినాథన్ దానిపై చాలా ఆసక్తి చూపించారన్నారు. ఆయన సహకారం, చొరవ కారణంగా అద్భుతమైన విజయం సాధించిందన్నారు. ఈ సదస్సు ఈ నెల 7 నుంచి 9 వరకు జరుగనున్నది. ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ (MSSRF), వ్యవసాయం-రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ సహకారంతో సదస్సు జరుగుతున్నది.