న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియంపై విమర్శలతో వార్తలో నిలుస్తున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు.. తాజాగా రాజకీయ సంబంధాలు ఉన్న లాయర్లు కూడా న్యాయమూర్తులు అవ్వొచ్చన్న అభిప్రాయాన్ని సమర్థించడంపై చర్చ జరుగుతున్నది. ఈ మేరకు సుప్రీంకోర్టు అడ్వకేట్ స్వరాజ్ కౌశల్ చేసిన ట్వీట్‌ను రిజిజు ఆదివారం రీట్వీట్ చేశారు.
‘జస్టిస్ కేఎస్ హెగ్డే, జస్టిస్ బహరుల్ కూడా హైకోర్టు జడ్జీలుగా నియమితులైన సమయంలో కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్నారు. జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్ కేరళ మంత్రిగా ఉన్నారు’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఓ న్యూస్ రిపోర్టును ట్యాగ్ చేశారు. బీజేపీతో రాజకీయ సంబంధాలు ఉన్న విక్టోరియా గౌరిని హైకోర్టు జడ్జీగా నియమించాలన్న ప్రతిపాదనను కొలీజియం వెనక్కు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు న్యాయవాదులు కోరడం అందులో ఉన్నది.