RG Kar Case | జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో నిరసన తెలుపుతున్న వైద్యులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ పంపారు. సాయంత్రం 5 గంటలకు చర్చలకు రావాలని లేఖలో ఆహ్వానించారు. 15 మంది వైద్యుల ప్రతినిధి బృందంతో చర్చలకు రావాలని కోరారు. చర్చలకు సీఎం మమతా బెనర్జీ సైతం హాజరుకానున్నారు. అయితే, ఆందోళన చేస్తున్న వైద్యులతో జరిగే చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న వైద్యుల విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించింది. చర్చల పారదర్శకత కోసం రికార్డు చేసేందుకు అంగీకారం తెలిపింది. గత రెండురోజుల నుంచి ప్రభుత్వం మూడుసార్లు చర్చలకు పిలిచింది.
ఇంతకు ముందు ప్రభుత్వ ప్రతిపాదనలు వైద్యలు తిరస్కరించారు. ప్రభుత్వం చర్చలకు పలు నిర్దిష్ట షరతులను విధించారు. ప్రభుత్వ ఆహ్వానంపై ఇప్పటి వరకు వైద్యులు స్పందించలేదు. అయితే, చర్చలకు 15 మంది ప్రతినిధులకు బదులుగా కనీసం 30 మంది ప్రతినిధులను అనుమతించాలని వైద్యులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను మమతా బెనర్జీ సమక్షంలోనే చర్చించాలని, ప్రత్యక్ష ప్రసారం చేయాలని స్పష్టం చేశారు. అయితే, ఆరోగ్యమంత్రి చంద్రిమా భట్టాచార్య డిమాండ్లను తిరస్కరించారు. వైద్యులతో చర్చలకు సంబంధించిన షరతులను అంగీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. వైద్యులు షరతులు విధించారని.. ఓపెన్ మైండ్‌తో సమావేశం నిర్వహించేందుకు సిద్ధంగా లేరన్నారు. వైద్యులు చెప్పే ప్రతి అంశాన్ని వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.