Kolkata Doctor Case | కోల్‌కతా, ఆగస్టు 23: జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనతో కోల్‌కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల విద్యార్థినులు, మహిళా డాక్టర్లు, సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒక్కొక్కరు హాస్టళ్లు, కళాశాల ప్రాంగణం వదిలి సొంతూర్లకు వెళ్లడం ప్రారంభించారు. ఈ నెల 14న కొందరు దుండగులు కర్రలు, రాళ్లు, రాడ్లతో దవాఖాన ప్రాంగణంలోకి చొరబడి దాడులు చేయడంతో వీరిలో భయాందోళనలు మరింత పెరిగాయి. అప్పటినుంచి పెద్ద సంఖ్యలో హాస్టళ్లను వదిలిపెట్టి వెళ్లారు. దీంతో ఇప్పుడు లేడీస్ హాస్టళ్లన్నీ ఖాళీగా మారిపోయాయి. గతంలో క్యాంపస్ హాస్టళ్లలో 160 మంది మహిళా జూనియర్ డాక్టర్లు ఉండగా, ఇప్పుడు 17 మంది మాత్రమే ఉన్నారని, నర్సింగ్ హాస్టళ్లలోనూ ఇదే పరిస్థితి ఉందని విద్యార్థులు చెప్తున్నారు.
గడియ లేకపోవడమే ఘటనకు కారణమా?
ట్రెయినీ డాక్టర్ హత్యాచారం జరిగిన సెమినార్ హాల్ తలుపు గడియ విరిగి ఉండటం ఇప్పుడు సీబీఐకి కొత్త అనుమానాలు కలిగిస్తున్నది. ఆమెను అంత క్రూరంగా హింసిస్తున్నప్పుడు బయటకు శబ్దం వినిపించి ఉండాలని సీబీఐ భావిస్తున్నట్టు సమాచారం. ఈ కేసులో అరెస్టయిన నిందితుడు సంజయ్ రాయ్‌కు కోర్టు శుక్రవారం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
విధుల్లోకి చేరిన వైద్యులు
11 రోజుల పాటు సమ్మె నిర్వహించి విధులకు దూరంగా ఉన్న వైద్యులు శుక్రవారం మళ్లీ విధుల్లో చేరారు. సుప్రీం కోర్టు సూచన మేరకు సమ్మె విరమిస్తున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ప్రకటించాయి. దీంతో శుక్రవారం దేశంలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు విధుల్లోకి చేరారు.