Helicopter Please | మహారాష్ట్రలోని పలు గ్రామాలకు ఇప్పటికీ సరైన రోడ్డు సౌకర్యాలు లేవు. గుంతలు పడిన మట్టి రోడ్లపైనే సైకిళ్లపై ప్రయాణం చేస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంత అధ్వానంగా రోడ్లున్నా ఓ ఒక్కరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. కానీ, ఓ రిటైర్డ్ ఆర్మీ మేజర్ మాత్రం నోరు మూసుకుని కూర్చోలేదు. ఏకంగా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకే లేఖ రాశాడు. ఆ లేఖలో కోరిన విషయాన్ని చూసి ప్రభుత్వ పెద్దలు అవాక్కయ్యారు. ఇంతకీ ఆ లేఖలో ఏమున్నదంటే..!
షెవ్‌గావ్ తహసీల్‌లోని సాల్వద్గావ్ నివాసి రిటైర్డ్ ఆర్మీ మేజర్ దత్తు భాప్కర్. ఈ గ్రామానికి వెళ్లే రోడ్డు గుంతలు పడి అధ్వానంగా తయారైంది. ఈ రోడ్డుపై సైకిల్ సవారీ ఏమోగానీ నడవడం కూడా కష్టమే. తమ గ్రామానికి రోడ్డు ఏర్పాటుచేయాలని గతంలో ఎన్నోసార్లు అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం లేకపోయింది. అందుకే మనస్థాపానికి గురైన రిటైర్డ్ ఆర్మీ మేజర్.. తమ గ్రామ రోడ్డు సమస్యను ఏకరువు పెడుతూ మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేకు లేఖ రాశారు. ‘తమ గ్రామానికి వెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేదు. గుంతలు, బురదతో నడవడం కష్టంగా ఉన్నది. అందుకని మా గ్రామానికి చేరుకునేందుకు హెలికాప్టర్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలి. అలా చేస్తే ఎగిరిపోతూ గుంతలను దాటగలుగుతాం’ అని లేఖలో పేర్కొన్నారు.
పైపెచ్చు ఈ లేఖ కాపీని సీఎం షిండేతో పాటు అహ్మద్‌నగర్ సౌత్ ఎంపీ సుజయ్ విఖే, షెవ్‌గావ్-పథర్డి ఎమ్మెల్యే మోనికా రాజ్లే, అహ్మద్‌నగర్ జిల్లా మెజిస్ట్రేట్, షెవ్‌గావ్ తహసీల్దార్‌కు కూడా పంపారు. ఈ లేఖను చూసి ప్రజాప్రతినిధులు, అధికారులు అవాక్కయ్యారు. గ్రామానికి రోడ్డు లేకపోతే హెలికాప్టర్ కొనుక్కోవడానికి గ్రాంట్ ఇవ్వడమా? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాగైనా ఆ గ్రామానికి రోడ్డు వస్తే సంతోషమే కదా అని షెవ్‌గావ్ వాసులు అంటున్నారు. ప్రస్తుతం ఈ లేఖ మహారాష్ట్రలో చర్చనీయాంశంగా మారింది.